డోర్నకల్‌లో డబుల్ దోపిడీ.. ఇలా అయితే పేదల కల ఎలా తీరేను?
డబుల్ బెడ్రూం ఇండ్లు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పేదలను ఊరిస్తున్న పథకం. ఇందిరమ్మ ఇల్లు పిట్టగూడులా ఉన్నాయని, బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలని కేసీఆర్ ఊదరగొట్టారు.
దిశ, డోర్నకల్: డబుల్ బెడ్రూం ఇండ్లు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పేదలను ఊరిస్తున్న పథకం. ఇందిరమ్మ ఇల్లు పిట్టగూడులా ఉన్నాయని, బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలని కేసీఆర్ ఊదరగొట్టారు. గొడ్డు, గోదా, బర్రె, గొర్రె, కోడి, కుక్కను పెంచుకునేలా రెండు పడకల ఇండ్లు బ్రహ్మాండంగా కట్టించి తాళం చెవి చేతిలో పెడతానని హామీలిచ్చారు. సర్కారు రాక ముందు నుంచి.. కేసీఆర్ ఉపన్యాసాల్లో మారుమోగింది. అయితే బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా అర్హులైన వారికి ఇల్లు మాత్రం కలగానే మిగిలింది. అయితే ఈ పథకంతో పేదలకు లబ్ధి పక్కన పెడితే గుత్తేదారులకు కల్పతరువుగా మారింది. ఇండ్లు తక్కువ లబ్దిదారులు ఎక్కువగా ఉండడంతో ఇండ్లు నిర్మించక ముందే లబ్ధిదారుల ఎంపిక చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
పునాదుల దశలోనే ఇళ్లు..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యేక చొరవతో 280 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో వెన్నారం గ్రామానికి 72 ఇండ్లు కేటాయించగా 18 రెండు పడకల ఇల్లు నిర్మాణం పూర్తయ్యాయి. గొల్లచర్ల, అందనాలపాడు, బంజర, డోర్నకల్, ట్రంకు తండా, చాపల తండా గ్రామాలకు రెండు పడకల ఇండ్లు కేటాయించారు. ఇందులో కొన్ని పునాదులు, పిల్లర్ల దశలోనే ఉండటం గమనార్హం. వెన్నారం, చావ్లా తండా, ట్రంకు తండా, గొల్ల చర్ల గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయినా వాటి నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అర్హులకు కేటాయించడంలో తీవ్ర జాప్యంతో ఇళ్లు పంపిణీ చేయడం లేదు.
దశాబ్దాలుగా ఆయా గ్రామాల్లో నివాసముంటున్న పేదలకు ఇళ్ల కేటాయింపు చేయకుండా అర్హులను గుర్తించకుండా జాప్యం చేస్తున్నారు. అసలే ఇండ్ల నిర్మాణం చేపట్టకపోగా.. పూర్తయిన చోట పంపిణీ చేయకుండా జాప్యం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల సంఖ్య కంటే లబ్దిదారులు ఎక్కువగా ఉండడం, అప్పటికే లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేయడంతో ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఇండ్లు పంచితే రాని వారు ఆందోళనలకు దిగుతారని స్థానిక నాయకులకు గుబులు పట్టుకుంది. అనేక పర్యాయాలు ఎమ్మెల్యే రెడ్యానాయక్ అధికారులతో సమావేశమై రెండు పడకల ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వీడి పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులను ఎమ్మెల్యే హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
పూర్తికాని నిర్మాణ పనులు..
కేసీఆర్ పాలనలో పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి చేయూతనిస్తున్నప్పటికీ మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. గూడు లేక శిథిలమైన ఇండ్లలో మగ్గుతున్నాం. గుత్తేదారులకు ముందుగా కష్టార్జితం ఇచ్చినోళ్లకే ఇండ్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కాంట్రాక్టర్ నిర్మాణాలు పూర్తి చేయడంలో లేదు. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లలో అనధికారికంగా నివాసం ఉంటున్నారు. నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపిక చేయాలని కోరుతున్నారు.
ఒక్క ఇల్లు ఇస్తే ఒట్టు!
మండలంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టి ఏండ్లు గడుస్తోంది. మండలంలో ఏ ఒక్క లబ్ధిదారుడికి పంపిణీ చేయక పోవడం గమనార్హం. కాంట్రాక్టర్లు ఇండ్ల ఆశ చూపి బీదల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లు అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైంది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న గూడు లేని అభాగ్యులకు నిరాశే మిగిలింది. - నెహ్రూనాయక్, కాంగ్రెస్ నాయకుడు
ముందస్తు వసూళ్లతో ముందుకెళ్లట్లే..
డబుల్ బెడ్రూం నిర్మాణాలు పూర్తి కాకమునుపే అవినీతి రాజ్యమేలుతోంది. పూర్తైన ఇల్లు తక్షణమే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. మిగిలిన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి పేదోడికి గూడు కల్పించాలి. ఓ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ధనికులకు ఇల్లు కేటాయించే విధంగా ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న గుత్తేదారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.- కె.సత్యనారాయణ, బీజేపీ నాయకులు