MLA Kadiam Srihari : 3 లక్షల మంది రైతులకు దీపావళి లోపు రుణమాఫీ
ఆధార్ కార్డు సరిగా లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వారు, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన 3 లక్షల మంది రైతుల పంట రుణాలు దీపావళి లోపు మాఫీ చేసేందుకు
దిశ, లింగాలఘణపురం : ఆధార్ కార్డు సరిగా లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వారు, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన 3 లక్షల మంది రైతుల పంట రుణాలు దీపావళి లోపు మాఫీ చేసేందుకు రూ.2 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని గుమ్మడవెల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…రూ. 2 లక్షల పైన పంట రుణాలు తీసుకున్న వారికి, రెండు లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానికి కావలసిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు.....
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించిందన్నారు. వారు చేసిన అప్పుకు మిత్తి, ఇన్స్టాల్మెంట్ చెల్లించాల్సి వస్తుంది అన్నారు. అయినప్పటికీ సంవత్సరంలోపే 23 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. డిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టిన రోజు వరకు రూ. 31 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. రైతులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోనే, దేశంలో ఎక్కడా లేని విధంగా, రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తూకం విషయంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోవద్దు...
గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల వద్ద మూడు నుండి నాలుగు కిలోల అధిక తూకం వేసుకుని తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. నిర్వాహకులు తూకం విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. రైతులు కూడా 17% మ్యాచర్ వచ్చేంతవరకు ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలన్నారు. రైతులను ప్రోత్సహించే అందుకే సన్నధాన్యంపై క్వింటాల్ రూ. 500 బోనస్ అందిస్తుంది అన్నారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలలో విక్రయించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కొమురయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్, తహసిల్దార్ రవీందర్, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్, పిఎసిఎస్ చైర్మన్ ఉపేందర్, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలత రెడ్డి,వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, నాయకులు మాజీ జెడ్పిటిసి వంశీధర్ రెడ్డి, పో రెడ్డి మల్లారెడ్డి, ఏలమూర్తి, దూసరి గణపతి, కృష్ణారెడ్డి, బిట్ల బాబు, దూసరి సోమనర్సయ్య, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.