ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు బస్సు సౌకర్యం కరువు..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత

Update: 2024-09-13 12:26 GMT

దిశ, గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం గూడూరు మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మాత్రం అందని ద్రాక్ష లాగానే మారింది.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరు మండలంలోని పలు గ్రామాలకు ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేదు. గూడూరు నుండి నెక్కొండ మరియు గూడూరు నుండి కేసముద్రం అలాగే గూడూరు నుండి పెనుగొండ మీదుగా మహబూబాబాద్ కు నిత్యం వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడం వలన గంటల తరబడి ప్రయాణికులు ఎదురుచూసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రయాణికులు వాపోతున్నారు.

ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను తీసుకొని వెళ్లాల్సిందే ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి దండిగా డబ్బులు దోచుకుంటున్నారు. అలాగే వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తామని అధికారులు చెబుతున్న అది మాత్రం అమలుకు నోచుకోవడం లేదు పూర్తి ఏజెన్సీ గ్రామాలు అయిన ఉట్ల, మట్టేవాడ, నేలవంచ, గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం లేకపోవడంతో అక్కడి ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మండల కేంద్రంలో సంత జరిగే రోజున వారానికి ఒక్కరోజు వచ్చి వారానికి సరిపడా నిత్యావసర వస్తువులు కొనుక్కొని వెళ్తూ ఉంటారు.. ఆ గ్రామాల నుండి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రానికి రావాలంటే ఆటో లను ఆశ్రయించాల్సిందే..

జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరమే అయిన బస్సు సౌకర్యం మాత్రం లేదు...

జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లె పల్లి , నాయకపల్లి , లక్ష్మీపురం , పెనుగొండ గ్రామాల మీదుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గం ఉంది గతంలో ఈ మార్గం లో బస్సు సౌకర్యం ఉండడం వలన చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారు కానీ గత సంవత్సరం నుండి ఈ మార్గంలో బస్సు సౌకర్యం లేక ఈ గ్రామాల ప్రజలు అదనంగా 15 కిలోమీటర్లు తిరిగి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రయాణికులు వాపోతున్నారు...

సాయంత్రం 5 గంటల లోపే గమ్య స్థానం చేరాలి...

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు వారి గమ్య స్థానం చేరాలంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల లోపు రావాల్సిందే. మండలంలోని గుండెంగ , మదనపురం , గాజుల గట్టు మరియు పలు తండాలకు సాయంత్రం సమయాల్లో వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే డబుల్ అమౌంట్ ఇవ్వాల్సిందే . హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే నెక్కొండ మరియు కేసముద్రంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉన్నందున ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాలలో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు వినతి...

గతంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులకు మరియు సంబంధిత ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ కు సైతం ఎన్నిసార్లు విన్నవించుకున్న అది ఫలితం లేకుండా పోయింది..ఇప్పటికి అయిన ఉన్నత అధికారులు స్పందించి వివిధ గ్రామ లలో బస్సు సర్వీసు లను నడపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు...

ఉచిత బస్సు సౌకర్యం ఈ ప్రాంత మహిళల కు అందుబాటులో లేకుండా పోయింది : నూకల ఉపేందర్

గూడూరు నుండి కేసముద్రం, నెక్కొండ అలాగే పెనుగొండ మీదుగా మహబూబాబాద్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు వేయించడం జరిగింది కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం నడపడం లేదు దీనివలన తెలంగాణలో నూతనంగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఈ ప్రాంత మహిళలకు అందుబాటులో లేకుండా పోతుందని కావున వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి ఈ రూట్ల లో ఆర్టీసీ బస్సులు నడపాలి.

ఈ ప్రాంతంలో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి : బానోతు భాస్కర్ నాయక్ , గుండెంగ గ్రామస్తుడు

గూడూరు మండల కేంద్రం నుంచి నెక్కొండ వరకు, మదనాపురం , గుండెంగ మార్గంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి అని అన్నారు. ఈ ప్రాంతం లో గిరిజన తండాలు ఎక్కువగా ఉన్నాయి అని ఇక్కడి ప్రజలు నిత్యం గూడూరు,నెక్కొండ కు వివిధ పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారు . ఈ మార్గం లో బస్సులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు కావున ఈ మార్గం గుండా ఒక బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయాలి.


Similar News