కడసారి యాత్రకు కన్నీటి వీడ్కోలు...కుసుమ జగదీష్ అంతిమయాత్ర.
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ (47) ఆదివారం
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ (47) ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్‌లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. గన్‌మెన్ల సాయంతో భార్య రమాదేవి వెంటనే ఆయనను హనుమకొండలోని లైఫ్‌లైన్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించగా సమయం లేకపోవడంతో అక్కడే అజర హాస్పటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు.జగదీష్ మరణించిన అనంతరం తన స్వగ్రామమైన ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి భౌతిక కాయాన్ని తీసుకువచ్చి ప్రజల సందర్శకం ఉంచగా ఆదివారం పెద్ద ఎత్తున మంత్రులు బీఆర్ఎస్ నాయకులు జగదీష్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.
మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు నివాళులు అర్పించారు. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌లతో కలిసి ములుగుకు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో ప్రత్యేక కాన్వాయితో మల్లంపల్లికి చేరుకొని జగదీష్ మృతదేహం పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో తనతో పాటు చురుగ్గా పాల్గొన్న జగదీష్ అకస్మాత్తుగా మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. రెండు దశాబ్దాలుగా కేసీఆర్ అప్పగించిన ప్రతీ పనిని నిర్వహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ సైనికుడిగా పనిచేసిన సోదరుడు జగధీష్ అకాల మరణం పార్టీతో పాటు ప్రజానికానికి తీరని లోటని అన్నారు.
చిన్న వయస్సులో చురుకైన నాయకుడిని కొల్పొవడం ములుగు జిల్లా ప్రజానికానికి తీరని లోటని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏ పిలుపునిచ్చిన ప్రాణాలకు సైతం తెగించి గప్పగా పని చేసి వీరోచితంగా, ధీరోదాత్తం గా పోరాడిన నాయకుడు జగదీశ్ అని తెలిపారు. ఈ పరిస్థితిలో మల్లంపల్లికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాల్సి రావడం ఎంతో దురదృష్టకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రావడం తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని అన్నారు. జగదీష్ కుటుంబానికి హృదయ పూర్వకంగా తనతో పాటు కేసిఆర్ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జగదీష్ కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో పేరు మాత్రమే సంపాదించుకున్న నేత జగధీష్ అని, ఆస్తి, పాస్తులు కూడబెట్టుకోలేని గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడికి అన్ని విధాలా అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. అనంతరం నిర్వహించిన జగధీశ్వర్ అంత్యక్రియల్లో భాగంగా మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ కవితలు జగధీశ్వర్ పార్థివ దేహానికి స్నానం చేయించారు.
అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు జగధీశ్వర్ పాడెను మోసారు. డప్పు చప్పుళ్ళ మధ్య జగధీశ్వర్ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధి చేశారు. జగదీశ్వర్ అంత్యక్రియల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఏర్పాట్లను పర్యవేక్షించగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. జగధీశ్వర్ అంతిమ యాత్రలో ఎమ్మెల్సీ లు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, తాత మధు సుధన్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, భాల్క సుమన్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, వరంగల్ , మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఆంబోతు బిందు, దనసరి అనసూయ సీతక్క, ములుగు శాసనసభ సభ్యులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరురి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, గౌష్ ఆలం ఎస్పీ, ఐటీడీఏ పీవో అంకిత్, బడే నాగజ్యోతి, వైస్ చైర్ పర్సన్,జిల్లా పరిషత్,వి. ప్రకాష్ రావు, ములుగు జిల్లాతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయన అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో తరలివచ్చి కడసారి వీడ్కొలు తెలిపారు.