రేయ్ చల్లా ధర్మారెడ్డి.. నీ అంతు చూస్తాం.. కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)
దిశ ప్రతినిధి, వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని మాజీమంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలోని కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాల స్మారక నిర్మాణాన్ని కూలగొట్టడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. చల్లా ధర్మారెడ్డిపై కాసింత పరుష పదజాలంతోనే మాట్లాడారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సురేఖ మాట్లాడిన దాని ప్రకారం... తాను పరకాల ఎమ్మెల్యేగా, కొండా మురళి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే అగ్రంపహాడ్‌లో మూడెకరాలకు పైగా స్థలాన్ని కొనుగోలు చేసి, ఆ ప్రాంత ప్రజల జాతర సౌకర్యార్థం ఉంచినట్లు తెలిపారు. అది దేవాదాయ శాఖకు అప్పగించలేదని, కూతురు సుస్మితా పటేల్ పేరు మీదనే తమ వద్ద కాగితాలు కూడా ఉన్నాయని తెలిపారు.
అయితే పరకాల ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి గెలుపొందిన నాటి నుంచి విగ్రహాలను తొలగించాలని పలుమార్లు యత్నించాడని గుర్తు చేశారు. గతంలోనూ ఇదే విధమైన ప్రయత్నం చేశాడని, అప్పుడు కలెక్టర్ వాకాటి కరుణ వారించారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కావాలనే దేవాదాయ శాఖ అధికారులకు కూల్చేసే విధంగా ఆదేశాలిచ్చాడని తెలిపారు. ధరణి పోర్టల్‌లో అనేక తప్పులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందేనని, అందులో భాగంగానే మా భూములను దేవాదాయ శాఖ భూములుగా పేర్కొన్నారని తెలిపారు. కొంతమంది కూల్చివేస్తుండగా కొండా మురళి అనుచరులు అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. అయితే చల్లా ధర్మారెడ్డికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈరోజు సాయంత్రం అగ్రంపహాడ్‌లో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఇదిలా ఉండగా అగ్రంపహాడ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కొండా మురళి అనుచరులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. పోలీసులు సైతం పెద్ద ఎత్తున మొహరించారు. రాజకీయంగా ఒక్కసారిగా పరకాల నియోజకవర్గంలో కాక పెరిగింది.