కేసీఆర్ సీఎం కాదు.. రాజు : రాహుల్ గాంధీ
కేసీఆర్ ముఖ్యమంత్రిలా గాక ఒక రాజుల పాలన చేస్తున్నాడని కాంగ్రెస్
దిశ, మంథని : కేసీఆర్ ముఖ్యమంత్రిలా గాక ఒక రాజుల పాలన చేస్తున్నాడని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు.విజయభేరి బస్సు యాత్రలో భాగంగా గురువారం మధ్యాహ్నం మంథనిలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సహకారం చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్ని విధాల ప్రయోజనం పొందిందని ఆరోపించారు. రైతులు, కర్షకులు, వ్యాపారులు, పేదలతో ఏ వర్గం ఆశలు నెరవేర లేదన్నారు. తెలంగాణ వచ్చిన పదేళ్ల దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు నడుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్లు బాగుపడ్డారే తప్ప మంథని ప్రాంత రైతులకు ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదన్నారు. తెలంగాణ సీఎం అత్యంత అవినీతిపరుడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం విపక్షాలపైఈడీ, ఐడీ, ఐటి దాడులు చేస్తుందని, తెలంగాణ ముఖ్యమంత్రి పై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని మరోసారి ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఆశలన్నీ నెరవేర్చుతామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్, మహిళలకు నెలకు 2500 చొప్పున ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలు అమలు అవుతున్నాయో లేదో వెళ్లి తెలుసుకోవాలన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ కాలం నుంచి ప్రజలతో తమకున్నది అభినాభావ సంబంధమని, అందుకే తన సోదరి ప్రియాంక గాంధీని తెలంగాణకు తీసుకొచ్చానని చెప్పారు. బీజేపీది కేవలం రాజకీయ బంధం మాత్రమేనన్నారు. దేశంలో కులగణన జరపడంలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దీనివల్ల పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకుండా అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగలను జరిపిస్తామన్నారు.ప్రధానమంత్రి మోడీ దేశ సంపద అంతా అదానీ చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. అలా అని తీసుకున్న అప్పులు అడగకుండానే మాఫీ చేస్తున్నారని, రైతులు చిరు వ్యాపారాలు తీసుకున్న రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.