గ్రామ అభివృద్ధి పేరుతో ఇసుక లారీల నుంచి అక్రమ వసూళ్లు..

మండలం లోని మల్లూరు(మామిడి గూడెం)సమ్మక్క - సారక్క గిరిజన ఇసుక సొసైటీ ఆధ్వర్యంలో రేజింగ్ కాంట్రాక్టర్లు నడిపిస్తున్న ఇసుక క్వారీలో లోడింగ్ లారీల నుంచి కొందరు గ్రామ పంచాయతీ మల్లూరు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Update: 2024-10-20 12:28 GMT

దిశ, మంగపేట: మండలం లోని మల్లూరు(మామిడి గూడెం) సమ్మక్క - సారక్క గిరిజన ఇసుక సొసైటీ ఆధ్వర్యంలో రేజింగ్ కాంట్రాక్టర్లు నడిపిస్తున్న ఇసుక క్వారీలో లోడింగ్ లారీల నుంచి కొందరు గ్రామ పంచాయతీ మల్లూరు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు మల్లూరు(మామిడి గూడెం)నుంచి సుమారు 2 వందలకు పైగా లారీలు ఇసుక లోడింగ్ చేస్తుండగా పంచాయతీ అధికారుల పేరుతో బిల్లులు ముద్రించి వసూళ్లు చేస్తున్నారని ఈ డబ్బు పంచాయతీలో జమ కాకపోవడంతో గ్రామస్తులు ఆదివారం పంచాయతీ కార్యదర్శి కిషోర్ ను నిలదీయడంతో ఆ వసూళ్లకు పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.

ఇసుక క్వారీ నిర్వహణ కొరకు ఈ నెల 9న జరిగిన మామిడి గూడెం లో జిల్లా పర్యావరణ అధికారులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత నుంచి మామిడి గూడెంలోని కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ పేరుతో పుస్తకాలు ముద్రించి పంచాయతీ అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రతి లారీ నుంచి గ్రామాభివృద్ధి పేరుతో వసూళ్లకు పాల్పడుతూ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపించారు. ఆ నోటా ఈ నోటా విషయం పంచాయతీ అధికారులకు చేరడంతో ఈ వసూళ్లకు పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు తెలపడంతో వసూలు రాయుళ్లతో గ్రామానికి చెందిన కొందరు యువకులు వసూలు రాయుళ్లతో వాగ్వివాదం చేసుకున్నట్లు సమాచారం. గడచిన రెండు మూడు నెలలుగా గ్రామాభివృద్ది పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తుల నుండి నిధులు రికవరీ చేసి పంచాయతీకి జమ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

వసూళ్లు నిజమే : ఇంచార్జ్ ఎంపీఓ కిషోర్

ఈ విషయమై మల్లూరు పంచాయతీ కార్యదర్శి, ఇంచార్జ్ ఎంపీఓ కిషోర్ ను వివరణ కోరగా కొందరు యువకులు పంచాయతీ పేరుతో పుస్తకాలు ముద్రించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆ వసూళ్లకు పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కిషోర్ తెలిపారు. సుమారు రెండు నెలలుగా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని ఇసుక లారీ యజమానుల నుంచి గ్రామాభివృద్ధి పేరుతో బిల్లులిచ్చిన వారిపై కఠిన చర్యలుంటాయని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. లక్షల రూపాయలు వసూళ్లు చేసిన వారిపై, సహకరించిన రేజింగ్ కాంట్రాక్టర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కిషోర్ తెలిపారు.


Similar News