వెలుగు నింపేది కాంగ్రెస్ పార్టీ.. ప్రియాంక గాంధీ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగ సభలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
దిశ, తొర్రూరు : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో శుక్రవారం భారీ బహిరంగ సభలో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నా కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. మీ ఇంటి పనులు వదులుకొని మరీ వచ్చారు.. మీ అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా' అని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రములో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నారని, వారి కాలపరిమితి అయిపోయిందని ఎద్దేవా చేశారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలని నినదించారు.
కేసీఆర్ తాను ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చలేదన్నారు. రైతులకు రూణమాఫీ చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మీ ఓటు చాలా విలువైనది.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల త్యాగాల వల్లే తెలంగాణ ఏర్పడిందని, అలాంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలని తాము భావించామన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు ఈ పదేళ్ల కాలంలో నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరాయా ? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇచ్చారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది ? అని ప్రశ్నించారు. నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్లు లీక్ కావడంతో యువతను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
పేపర్ లీకేజీలను అరికడతామని ప్రియాంక గాంధీ అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం వక్రీకరించిందని విమర్శించారు. ప్రతి మహిళ ఖాతాలో రూ.2500 వేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే రూ.500కు గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుకు ఏడాదికి రూ.15వేలు, వరికి కనీస మద్దతుతో పాటు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిందన్నారు. యువకుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి యశశ్విని రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, కేవలం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తానని చెప్పి, అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ ఆరు గ్యారెంటీ కార్డులు అమలు చేసి మాట నిలబెట్టుకుంటాం. కేసీఆర్ గిరిజనులకు గిరిజన బంధువు ఇస్తానని, మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో చెప్పిన దళిత బంధు ఏ ఒక్క లబ్ధిదారునికి ఇవ్వకపోగా, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి గిరిజన బంధు మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.
గిరిజన సోదరులకు పెద్దపీట వేసిన పార్టీ కాంగ్రెస్. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు గిరిజన సోదరులు, ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి రాబోయే 6 రోజులు నాకోసం కష్టపడండి, వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతామన్నారు. ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత నాకు వచ్చే జీతానికి కూడా పాలకుర్తి నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక సైనికులు లాగా పని చేయాలన్నారు.
ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో దయాకర్ రావు ఓటమి ఖాయమని, దయాకర్ రావుని ఓడించేందుకు.. నేను నా భర్త రాజేందర్ రెడ్డి.. నా కోడలు ముగ్గురం కంకణం కట్టుకున్నాము. అదేవిధంగా మా కోడలు ఒక్కరిని గెలిపించుకుంటే ముగ్గురం పనిచేస్తాము. ప్రజలందరూ ఎర్రబెల్లిని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీగా అమలు చేయడంతో పాటు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి ఒక సైనికుని లాగా పని చేయాలన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ మాటలాడుతూ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పక్క అధికారంలోకి వస్తుంది ఖమ్మంలో పదికిపది సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. కాబట్టి పాలకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో యశస్విని రెడ్డిని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. రాజకీయాల్లోకి యూత్ మొదటి పాత్ర వహిస్తున్నారు కాబట్టి మీ యూత్ యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గూండాగిరి భూ అక్రమాలు పేపర్ లికేజీలు వంటి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునేందుకు మనమంతా నడుము గట్టి ముందుకు కదలాలి.