తెరపైకి ఎల్ఆర్ఎస్.. భూ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సన్నద్ధం
అనుమతి లేని ప్లాట్లు, లే అవుట్లను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి.
దిశ, వరంగల్ బ్యూరో : అనుమతి లేని ప్లాట్లు, లే అవుట్లను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి.నిబంధనలు పాటించకుండా కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరిస్తామని గత ప్రభుత్వం పేర్కొనడంతో దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు విధివిధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పగ్గాలు చేపట్టాకా ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగిరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీల అమల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌కు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై మూడు నాలుగు రోజుల్లోనే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతి లేని ప్లాట్లు, లే అవుట్లు క్రమబద్ధీకరణకు ఎస్‌ఆర్‌ఎస్ పేరిట దరఖాస్తులు స్వీకరించగా జిల్లాలో భారీగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఎల్‌ఆర్‌ఎస్ కోసం భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొందరు కోర్టును ఆశ్రయించగా ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో నాలుగేళ్ల పాటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొని ఇళ్లు నిర్మించుకోవాలని భావించిన కొందరు కోర్టు తీర్పునకు లోబడి ఉంటామని అఫిడవిట్ దాఖలు చేయగా వారికి ఎల్‌ఆర్‌ఎస్ వర్తింపజేశారు. మిగతా దరఖాస్తుదారులు మాత్రం ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూసినా గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు ప్లాట్లకు మొత్తం డబ్బు చెల్లించినా ప్రభుత్వ అనుమతి లేక రిజిస్ట్రేషన్ కాలేదు.
ఇదీ జిల్లాలో పరిస్థితి..!
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలైన మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, పరకాల, భూపాలపల్లి, జనగామ కార్యాలయాలకు మొత్తం 1,57,978 దరఖాస్తులందాయి. 2020 అక్టోబక్టో ర్ 31 వరకు కొనసాగగా, ఆన్లైన్లో రూ.1,000 ఫీజు చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల ద్వార ప్రభుత్వ ఖజనాకు రూ.15.97 కోట్ల మేర ఆదాయం లభించింది. 22,105 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 1,193 తిరస్కరించారు. కేవలం 255 దరఖాస్తులకు మాత్రమే ఆమోదం తెలపడం గమనార్హం. అలాగే 1,126 ప్లాట్లకు రుసుము చెల్లించాలని యజమానులకు లేఖలు పంపించారు. మిగతావన్నీ అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. అనుమతులు ఇచ్చిన 255 ప్లాట్ల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి రూ.1,35,58,716 ఆదాయం సమకూరింది.
ఇలా దరఖాస్తుల పరిశీలన..
కొత్త, పాత దరఖాస్తులను సుపరిపాలన కేంద్రం(సీజీజీ) రూపొందించిన అప్లికేషన్ ద్వారా పరిశీలిస్తారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తులను నిషేధిత భూములతో పోల్చి ఒకవేళ ఆ జాబితాలో ఉంటే తిరస్కరిస్తారు. ఆ తర్వాత సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ లేదా పంచాయతీ ఈవో లేదా స్థానిక సంస్థల సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. దరఖాస్తులో పేర్కొన్న భూములు ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ భూములు, జలవనరుల ఫిల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్టీఎల్)లో ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. వీరి వద్ద ఉండే మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్ వివరాలతోపాటు స్క్రూటీని చేస్తారు. వీరు పంపే దరఖాస్తులను నీటిపారుదల, రెవెన్యూ లేదా టౌన్‌ప్లానింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ముగ్గురూ ఆయా దరఖాస్తులను తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు లేదా మార్పులతో మరోసారి దరఖాస్తుకు ఆదేశించవచ్చు.
ఈ దశలో వడపోత తర్వాత డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్లు పరిశీలిస్తారు. రెండో దశకు చేరుకునే దరఖాస్తులను టౌన్‌ప్లానింగ్ అధికారులు లేదా పంచాయతీ అధికారులు మాస్టర్‌ప్లాన్, రోడ్ల విస్తరణ నిబంధనలు, జోన్ నిబంధనలు, ఖాళీ స్థలాల వివరాలను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే లేఅవుట్లకు ఫీజును నిర్ణయిస్తారు. దరఖాస్తుదారులు నిర్ణీత ఫీజును చెల్లించాక మూడో దశ వడపోతకు దరఖాస్తులు వెళ్తాయి. మూడో దశకు చేరిన దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, పట్టణాభివృద్ధి సంస్థల వైస్ చైర్మన్లు, అదనపు కలెక్టర్లు(స్థానిక సంస్థలు) పరిశీలిస్తారు. దరఖాస్తులో లోపాలుంటే తిరస్కరిస్తారు. వీరు ఆమోదించే దరఖాస్తులు నాలుగో దశకు చేరుతాయి. నాలుగోదశలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్, జిల్లాల్లో కలెక్టర్లు పరిశీలించి ఆమోదిస్తారు. ఈ అన్ని దశల్లో క్షేత్రస్థాయి బృందం ఇచ్చే నివేదిక అత్యంత కీలకమైనది.
యంత్రాంగం కసరత్తు..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీచేసిన నోటీసులకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్‌లను) ఏర్పాటు చేయనున్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఉద్యోగులను, అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోనేందుకు కలెక్టర్లకు అవకాశం కల్పించింది.