క‌ల‌ప అక్రమ ర‌వాణాపై ఆరా తీస్తున్న అట‌వీ శాఖ అధికారులు

ఛత్తీస్ ఘ‌డ్ రాష్ట్రం స‌రిహ‌ద్దు ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక లారీ ముసుగులో క‌ల‌ప‌ను త‌ర‌లిస్తుండ‌గా శుక్రవారం వాజేడు అట‌వీశాఖ అధికారులు గుర్తించారు.

Update: 2023-05-22 09:08 GMT

దిశ, ఏటూరునాగారం: ఛత్తీస్ ఘ‌డ్ రాష్ట్రం స‌రిహ‌ద్దు ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక లారీ ముసుగులో క‌ల‌ప‌ను త‌ర‌లిస్తుండ‌గా శుక్రవారం వాజేడు అట‌వీశాఖ అధికారులు గుర్తించి ప‌ట్టుకున్న విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ మేర‌కు అట‌వీశాఖ అధికారులు కలప అక్రమ రవాణా చేస్తున్నది ఎవరని ద‌ర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స‌మాచారం. కాగా క‌ల‌ప ర‌వాణా వాహ‌నాన్ని ప‌ట్టుకున్న వాజేడు ఎఫ్ఆర్‌వో బానోత్ చంద్రమౌళిని దిశ వివ‌రణ కోర‌గా లారీలో ఇసుక మాటున త‌ర‌లిస్తున్న క‌ల‌ప ప‌రిమాణం 4.5539 క్యూబిక్ మీట‌ర్లు ఉంద‌ని, దాని విలువ సుమారు రూ.6 ల‌క్షల 66వేలుగా ఉంద‌ని తెలిపారు.

కాగా ప‌ట్టుబ‌డిన లారీ తాడ్వాయి మండ‌లం న‌ర్సింగ‌పూర్ గ్రామానికి సంబంధించినదిగా గుర్తించామ‌ని చెప్పారు. ద‌ర్యాప్తులో ఏపీ16టీబీ 5757 అనే లారీ చౌలా మ‌ల్లేష్ పేరు మీద రిజ‌స్టర్ అయినట్లు గుర్తించామ‌ని తెలిపారు. ప‌ట్టుకున్న లారీ జీరోగా (ఎలాంటి ఇసుక అర్హత ప‌త్రాలు) లేవ‌ని త‌మ ద‌ర్యాప్తులో తెలిసిన‌ట్లు తెలిపారు. ప‌ట్టుకున్న లారీలో క‌ల‌ప‌, ఇసుక‌ను ఇసుక రీచ్‌లో నింపారా..? లేదా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని న‌దీ స‌మీపాన ఇసుక‌ను నింపారా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఆర్‌వో తెలిపారు. ప‌ట్టుకున్న అక్రమ క‌ల‌ప‌, ఇసుక ర‌వాణా చేస్తున్న లారీ ఘ‌ట‌న పై తెలంగాణ ఫారెస్టు యాక్ట్ 1967 ప్రకారం సెక్షన్ 20,29,44 కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నట్టు అట‌వీశాఖ అధికారి తెలిపారు.

జీరో దందా కొన‌సాగుతున్నట్లేనా..?

గత కొంత కాలం క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఇసుక లారీలా న‌కిలీ వేబిల్లుల ముఠా విష‌యం మ‌రువ‌క ముందే మ‌ళ్లీ అదే త‌ర‌హాలో జీరో లారీ(వే బిల్లు, డీడీ ప‌త్రాలు)లేకుండా ప‌ట్టుబ‌డడంపై ప్రజ‌లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప‌ట్టుబ‌డిన ఇసుక లారీకి ఎలాంటి వేబిల్లు, డీడీ లేక పోవ‌డంతో ఇప్పటికీ జీరో దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఘ‌ట‌నలో ఒకే సంద‌ర్భంలో ఇసుక, క‌ల‌ప అక్రమ ర‌వాణా వంటి రెండు నేరాలు బ‌య‌ట‌ ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News