‘ఫాగింగ్‌ ఫ్రాడ్’..దోమల పేరుతో నిధుల దోపిడీ

అవినీతికి పెట్టని కోటగా నిలుస్తోంది. వరంగల్‌ మహానగర పాలక సంస్థ. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో పాలనా వ్యవస్థ మొత్తం అక్రమాలకు ఆలవాలంగా మారింది.

Update: 2024-08-25 02:03 GMT

దిశ,వరంగల్‌ టౌన్:అవినీతికి పెట్టని కోటగా నిలుస్తోంది. వరంగల్‌ మహానగర పాలక సంస్థ. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో పాలనా వ్యవస్థ మొత్తం అక్రమాలకు ఆలవాలంగా మారింది. ఫైలు కదలిస్తే పైసలు, పర్మిషన్‌ ఇస్తే పైకం, కాంట్రాక్ట్‌ పనులు, బిల్లుల్లో కమీషన్లు, చివరకు ప్రజోపయోగమైన పరికరాలు, యంత్రాల కొనుగోళ్లలోనూ గోల్‌మాల్‌ గోవిందంగా మారిపోయింది. ప్రజాపాలనను గాలికొదిలేసిన బల్దియా పాలకవర్గం, అధికార యంత్రాంగం ప్రజారోగ్యాన్ని పక్కన పడేసింది.

దోమల మాటున ధనదాహం!

ప్రజాపాలనను గాలికొదిలేసిన బల్దియా పాలకవర్గం, అధికార యంత్రాంగం ప్రజారోగ్యాన్ని పక్కన పడేసింది. దోమల నివారణోపాయాలను తమకు అనువుగా మలుచుకుని ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి చేతులు దులుపుకుంటున్నారు. లక్షలకు లక్షలు వెచ్చించి మలేరియా సోకిన రోగుల్లా మిన్నకుండిపోయారు.

8 మిషన్‌లకు రూ.68 లక్షలు!

బల్దియాలో దోమల నివారణ కోసం తరచూ ఫాగింగ్‌ చేస్తుంటారు. ఇందుకు బల్దియాలో నాలుగు ఆటో ఫాగింగ్‌ మిషన్లు, 32చిన్న మిషన్లు ఉన్నాయి. అయితే, వీటిలో దాదాపు అన్ని మర‘మ్మత్తు’లోనే మూలుగుతున్నాయి. కేవలం రెండు ఆటో మిషన్లు, కొన్ని చిన్న మిషన్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని రిపేరు చేయించడానికి ఇష్టపడని బల్దియా పాలకులు, అధికారులు కొత్త మిషన్ల కొనుగోళ్లకు తెరలేపారు. ఏకంగా 8 ఆటో ఫాగింగ్‌ యంత్రాలకు అక్షరాల రూ.68లక్షలను ఓ కంపెనీకి ముందస్తుగానే ముట్టజెప్పారు. ఈ వ్యవహారం నిన్నమొన్నటిది కాదు..అంత మొత్తం డబ్బులు చెల్లించి ఇప్పటికే మూడేళ్లు కావొస్తోంది. అయినా ఆ మిషన్ల ఊసే లేదు. అవి వస్తాయో రావో కూడా అధికారులకు, పాలకులకు కూడా తెలియని దుస్థితి నెలకొందంటే ఆశ్చర్యపడాల్సిందే.

ఎంత కొట్టినా దోమ చావదే!

ఈ బాగోతం ఇలా ఉంటే.. ఉన్న మిషన్లతో ఫాగింగ్‌ కూడా సక్రమంగా చేయడానికి బల్దియా అధికారులు మొహమాటపడుతున్నారు. దోమలను చంపితే మహా పాపం చుట్టుకుంటుందన్న తరహా వైరాగ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక అడపాదడపా పిచికారీ చేసే దోమల మందుతో ఒక్క దోమ కూడా చావడం లేదనే వాదనలు ఉన్నాయి. మందు కొట్టిన కొద్దిసేపు దోమలు చనిపోయినట్లు నటించి, మళ్లీ స్వైరవిహారం చేస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. మందులోనే లోపం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. చౌక మందు కొనుగోలు చేసి వెదజల్లుతున్న ట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దోమకాటుకు బాధ్యులెవరు?

ఇప్పటికే నగరంలో మలేరియా, డెంగ్యూ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. కొందరైతే రెండు, మూడు నెలలకోసారి దోమ కాటుకు గురై ఆస్పత్రి పాలవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి.. ఈ పరిస్థితులకు కారకులు ఎవరు? ప్రజల అనారోగ్యానికి బాధ్యులెవరు? యంత్రాల కొనుగోలుకు ఆమోదం తెలిపిన బల్దియా పాలకవర్గానిదా? ముందస్తుగానే కంపెనీ డబ్బులు కట్టి యంత్రాల పై దృష్టిసారించని అధికారులదా? పసలేని మందుకు అలవాటుపడిన దోమలదా? అనేది అధికారులు, పాలకులే సెలవివ్వాలి. ముఖ్యంగా మందు నాణ్యతను పరిశీలించకుండానే దోమల మందు కొనుగోలుకు అనుమతులు ఇచ్చిన ఈఈ సమాధానం చెప్పాలి. యంత్రాల కొనుగోళ్ల వ్యవహారంపై బల్దియా పాలకవర్గం నోరు విప్పాలి. ప్రజారోగ్య పరిరక్షణకు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలి.


Similar News