శోభాయాత్రకు స‌ర్వం సిద్ధం

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి అధికార యంత్రాంగం క‌ట్టుదిట్టంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది.

Update: 2024-09-15 14:18 GMT

దిశ, హన్మకొండ టౌన్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి అధికార యంత్రాంగం క‌ట్టుదిట్టంగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది. నిమ‌జ్జ‌నం చేసే ప్రాంతాల్లో ఇప్ప‌టికే క్రేన్ల ఏర్పాట్లు, విద్యుత్ సౌక‌ర్యం, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేశారు. పంచాయ‌తీ, మున్సిప‌ల్‌, విద్యుత్‌శాఖ‌, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేష‌న్‌తో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారులు కో ఆర్డినేష‌న్‌తో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా 9 వేల వ‌ర‌కు విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠించారు. వరంగల్ ట్రై సిటీలోనే 4,600 కు పైగా గణనాథుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో నిమజ్జనానికి నగర చుట్టుపక్కల 24 చెరువులను గుర్తించారు.

    ఈ మేరకు నిమజ్జన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు నోడ‌ల్‌ ఆఫీసర్లను నియ‌మించారు. ఖైరతాబాద్ తరహాలోనే వరంగల్ నగరంలో ఈసారి భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ విగ్రహం 70 అడుగుల పొడవు ఉండగా.. వరంగల్ మట్వాడా ఎల్లంబజార్ లో 40 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ ట్రై సిటీ వ్యాప్తంగా నిమజ్జనానికి గుర్తించిన 24 చెరువుల వద్ద 24 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో సిటీలో ఉన్న భారీ విగ్రహాల కోసం రెండు చెరువుల వద్ద రెండు భారీ క్రేన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చెరువుల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.

మూడు వేల మందితో భ‌ద్ర‌త‌

పెద్ద విగ్రహాల నిమజ్జనానికి సిద్ధం చేసిన సిద్దేశ్వర దేవాలయం కోనేరు, చిన్న విగ్రహాల కోసం పద్మాక్షి గుండం, కోట, వంగసముద్రం, కట్ట మల్లన్న చెరువు,  బంధం చెరువు, గుండు చెరువు, బెస్తం చెరువుతో పాటుగా చిన్నచిన్న  చెరువులలో నిమజ్జనం చేయ‌నున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు శారదా దేవి, ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖేడే లతో కలిసి నిమజ్జనం చేసే ప్రాంతాలను పరిశీలించారు.

    ఏర్పాట్ల‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. నిమజ్జనం నిర్వహిస్తున్న ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ క్రెయిన్స్, తెప్పలు, రెస్క్యూ టీమ్స్‌ను అధికారులు సిద్ధం చేశారు. మూడు వేల మంది పోలీసులతో నిమజ్జనానికి బందోబస్తు నిర్వహించారు. భారీ విగ్రహాలను చిన్న వడ్డేపల్లి, ఉర్సు చెరువు, కోట చెరువు, బంధం చెరువుకు తరలించనున్నారు. సిద్ధేశ్వర గుండంలో కేవలం నాలుగు ఫీట్ల విగ్రహాలకు మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇవ్వనున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు.

మ‌ద్యం అమ్మ‌కాలు బంద్‌

ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్‌ 16న మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు జారీ చేశారు. సోమ‌వారం ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్లు మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు.

    గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల‌ని అన్నారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మ‌హ‌బూబాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాల్లోనూ మ‌ద్యం నిషేధాన్ని పాటించాల‌ని ఆయా జిల్లాల ఎస్పీలు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News