టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయండి: కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు.
దిశ, జనగామ: టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. శుక్రవారం టీబీ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కాదని, సరైన మందుల వాడకంతో అదుపులో ఉంచినట్లయితే నివారించ వచ్చుని తెలపారు. ప్రజలను చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు. జిల్లాలో 578 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వారికి వైద్య చికిత్సలు జరుగుతాయని, ప్రతినెల చికిత్స కాలానికి రూ. 500 పోషణ భత్యం అందజేయడం జరుగుతుందని చెప్పారు.
దీనివల్ల టీబీ వ్యాధిగ్రస్తులు చికిత్స కాలంలో మంచి పోషకాహారం తీసుకోవడం కొరకు ఈ పోషణ భత్యం ఉపయోగపడుతుందని తెలిపారు. టీబీ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా నిర్వహిస్తారని, జిల్లాను టీబీ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. అంతక ముందు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి న్యూట్రీషన్లు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా టీబీ వ్యాధి నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.మహేందర్, డాక్టర్ భాస్కర్, టీబీ ప్రోగ్రాం నియంత్రణ అధికారి డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.