హడలెత్తిస్తున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దొంగలు..
అసలే నీరు లేక అల్లాడుతున్న రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ దొంగలతో పరిస్థితి

దిశ, బచ్చన్నపేట : అసలే నీరు లేక అల్లాడుతున్న రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ దొంగలతో పరిస్థితి మరింత జటిలమవుతుంది. భూగర్భ జలాలు లేక బోర్లు పోయక ఉన్నదాంట్లో అటు ఇటు గా నెట్టుకొస్తున్న రైతన్నలకు గత 15 రోజులలో రెండు సార్లు ట్రాన్స్‌ఫార్మర్ విప్పి కాపర్ వైర్ దొంగలించడం తో రైతులకు షరాఘాతమైంది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్ అపహరించిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని చినరామచర్ల గ్రామ శివారులొ 15 రోజు ల వ్యవధి లోపు గుర్తు తెలియని దుండగులు పలుమార్లు చోరీకి పాల్పడ్డారు. 15 రోజుల క్రితం గ్రామంలో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్ నుండి కాపర్ వైర్ దొంగలించారు. ఇలా వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో నిద్ర పోవాలి అంటే భయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి పాల్పడుతున్న దుండగులను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.
వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని చిన్నరామచర్ల గ్రామ సమీపంలోని పుర్మ శ్రీనివాస్ రెడ్డి అనే రైతు చేను లో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని పగలగొట్టి అందులో గల కాపర్ వైర్ ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దొంగలు మద్యం సేవించి మద్యం బాటిళ్లు అక్కడే పడేసినట్టు రైతు తెలిపాడు. స్థానిక రైతు పుర్మ శ్రీనివాస్ రెడ్డి సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ ఫార్మర్ పరిశీలించి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వరుస దొంగతనాలను సవాలుగా తీసుకున్న పోలీసులు దొంగల ఆచూకీ కోసం దర్యాప్తును ప్రారంభించారు.