బల్దియా బడా బడ్జెట్​.. ఆకాశమే హద్దుగా జీడబ్ల్యూఎంసీ పద్దు

మహిళలు మెట్టెలు చేయించుకున్న ప్రతీసారి మరింత వెండి చేర్చి

Update: 2025-03-21 01:55 GMT
బల్దియా బడా బడ్జెట్​.. ఆకాశమే హద్దుగా జీడబ్ల్యూఎంసీ పద్దు
  • whatsapp icon

దిశ,వరంగల్‌ టౌన్ : మహిళలు మెట్టెలు చేయించుకున్న ప్రతీసారి మరింత వెండి చేర్చి చేయించుకోవడం ఆనవాయితీ. అదే రీతి ఇప్పుడు వరంగల్‌ మహానగర పాలక సంస్థ ఆచరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఏటా రూపొందించే బడ్జెట్‌లో అంకెలు పెంచుతూ మెట్టెలసవ్వడిని అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. గతేడాది రూ.650.12కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించిన గ్రేటర్‌ వరంగల్‌ బల్దియా ఈ సారి ఏకంగా రూ.350కోట్లకు పైగా అదనంగా పెంచింది. 2025–26 బడ్జెట్‌ను రూ.1071.48కోట్ల అంచనాలతో గురువారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టింది. గతేడాది బడ్జెట్‌ అంచనాలు లక్ష్యాన్ని అందుకోకపోగా, ఈ సారి ఇంత భారీ మొత్తంలో బడ్జెట్‌ రూపొందించడంపై కార్పొరేటర్లతోపాటు ప్రజలు ఆశ్చరానికి లోనయ్యారు. బల్దియాకు సమకూరే ఆదాయం రూపొందించిన బడ్జెట్‌లో సగం కూడా లేకపోగా, అంకెలతో మునగ చెట్టెక్కడం సరికాదని బాహాటంగానే విమర్శిస్తున్నారు.

బడ్జెట్‌ స్వరూపం..

2025–26 సంవత్సరానికి వరంగల్‌ మహానగర పాలక సంస్థ రూ.1071.45కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను మేయర్‌ గుండు సుధారాణి గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఎక్స్‌అఫీషియో మెంబర్లు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు సమక్షంలో కార్పొరేటర్లు బడ్జెట్‌పై ఆమోదం తెలిపారు. ఇందులో వివిధ పన్నుల రూపంలో రూ.337.38కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అలాగే వివిధ గ్రాంట్ల రూపంలో రూ.728.10కోట్లు బల్దియాకు వస్తాయని నిర్ధారించారు. ఇక ఉద్యోగుల జీతభత్యాలు, శానిటేషన్‌, కరెంట్‌ బిల్లులు, గ్రీన్‌ బడ్జెట్‌ అన్ని కలిపి రూ.197.96కోట్లు ఖర్చు కానున్నాయని బడ్జెట్‌లో పొందుపరిచారు.

విలీన గ్రామాలకు రూ.24.77కోట్లు..

జీడబ్ల్యూఎంసీ లో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.24.77కోట్లు కేటాయించారు. ఇందులో రోడ్లకు రూ.12 కోట్లు, డ్రైనేజీ వ్యవస్థకు 8.72కోట్లు, నీటి సరఫరాకు రూ.2కోట్లు, ఇతరత్రా పనులకు రూ.2.05కోట్లు ప్రతిపాదించారు.

నగరం పరిధిలో వివిధ పనులకు రూ.10.40కోట్లు..

ఇక నగరంలో వివిధ అభివృద్ధి పనులకు గాను రూ.10.40కోట్లు కేటాయించారు. పార్కులు, ఆట స్థలాల అభివృద్ధికి రూ.1.50కోట్లు, వైకుంఠధామాల నిర్వహణకు రూ.2కోట్లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణకు రూ.50లక్షలు, మార్కెట్ల నిర్వహణకు రూ.కోటి, డంపింగ్‌ యార్డుకు రూ.3.50కోట్లు ఇతరత్రా పనులకు రూ.1.90కోట్లు ప్రతిపాదించారు.

వార్డుల వారీగా అంచనాలు..

వార్డుల వారీగా వివిధ అభివృద్ధి పనులకు రూ.39.15కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లకు రూ.17.50కోట్లు, డ్రైనేజీలకు రూ.15.45కోట్లు, నీటి సరఫరాకు రూ.1.50కోట్లు, వీధి దీపాలకు రూ.50లక్షలు, కార్యాలయాల నిర్వహణకు రూ.2.20కోట్లు, ప్రధాన కూడళ్ల అభివృద్ధికి రూ.2కోట్లు కేటాయిస్తూ నిర్ణయించారు.

ప్రభుత్వంపైనే అధిక ఆశలు..

ఇక బల్దియాకు సొంతంగా సమకూరే ఆదాయం కంటే ప్రభుత్వం నుంచి ఎక్కువగా ఆశిస్తున్నట్లు బడ్జెట్‌ లెక్కలు తేటతెల్లం చేస్తున్నాయి. గతేడాది బడ్జెట్‌లో రూ.350కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సాయం అందుతుందని అంచనా వేయగా ఈ సారి దాన్ని రెట్టింపు చేశారు. సుమారు రూ.728.10కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్ల ద్వారా అందుతాయని అంచనా వేశారు. ఇందులో కేంద్రం నుంచి రూ.55.28కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.672.82కోట్లు అందుతాయని ఆశిస్తున్నారు.

ఆకాశానికి నిచ్చెనలు..

మొత్తంగా 2025–26 బడ్జెట్‌ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా అభివర్ణిస్తున్నారు. గతేడాది రూపొందించిన రూ.650.12కోట్ల బడ్జెట్‌లో రూ.350కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందని అంచనా వేసినప్పటికీ కేవలం రూ.100 కోట్లు మాత్రమే అందడం గమనార్హం. గతేడాది మొత్తం బడ్జెట్‌లో కేవలం రూ.300కోట్లు మాత్రమే వాస్తవ పద్దుగా తేలింది. మిగతా కేవలం అంచనాలకే పరిమితమైనట్లు స్పష్టమవుతోంది. ఈ సారి ఏకంగా కొండకు తాడు కట్టినట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లపై రూ.728 కోట్లకు పైగా అంచనాలు వేయడం బల్దియా పాలకుల అత్యుత్సాహానికి, అంకెల గారడీకి అద్దం పడుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా బల్దియా బడ్జెట్‌ : మంత్రి కొండా సురేఖ

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన రూ.3లక్షల కోట్లకుపైగా బడ్జెట్‌కు అనుగుణంగా వరంగల్‌ మహానగర పాలక సంస్థ బడ్జెట్‌ ప్రతిబింబిస్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. బల్దియా బడ్జెట్‌ సమావేశానికి మంత్రి ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా హాజరయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ పేదల బడ్జెట్‌గా నిరూపితమైందన్నారు. ముఖ్యంగా 40 శాతం పైగా నిధులు మహిళల కోసమే కేటాయించినట్లు తెలిపారు. ఇది మహిళ బడ్జెట్‌ అని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. అదే తరహాలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్దదైన వరంగల్‌ కార్పొరేషన్‌పై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్‌ మహానగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 5 వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని తెలిపారు. అందుకు అనుగుణంగా నేటి బడ్జెట్‌ నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూ.1071.48కోట్లతో బల్దియా బడ్జెట్‌ రూపొందించడం అభినందనీయమన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నోటిఫికేషన్‌ జారీ కానుందని పేర్కొన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇన్నర్‌, ఔటర్‌ రింగురోడ్డు, టెక్స్‌టైల్‌ పార్క్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

నేటి బడ్జెట్‌ ఓ చరిత్ర : మేయర్‌ గుండు సుధారాణి

నేటి వరంగల్‌ బల్దియా బడ్జెట్‌ కార్పొరేషన్‌ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని మేయర్‌ గుండు సుధారాణి అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్‌ ఆమోదానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్‌ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్‌ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ఇందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న స్టాంప్‌డ్యూటీ ఫండ్స్‌ రూ.187కోట్లు ఇచ్చి నగరాభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌, శానిటేషన్‌ వర్కర్స్‌కు జీతాలను పెంచుకోవడం జరిగిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా నేటి బడ్జెట్‌ నిలుస్తుందని పేర్కొన్నారు. బల్దియా ఆదాయం పెంచుకునే విధంగా ఇప్పుడున్న మున్సిపల్‌ చట్టంలో లేఔట్లు , గవర్నమెంట్‌ ల్యాండ్స్‌ అభివృద్ధిపై కార్పొరేషన్‌కు హక్కులు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Similar News