బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పిలుపునిచ్చారు.

Update: 2023-05-17 06:39 GMT

దిశ, వరంగల్ టౌన్: ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ 22వ డివిజన్ ఇంచార్జ్ మావూరపు గీతా విజయ్ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం రాత్రి ముఖ్య కార్యకర్తల ముందస్తు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నరేందర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి డివిజన్ల వారీగా చేపట్టాల్సిన చర్యలు, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధిపై కూలంకషంగా చర్చించారు. డివిజన్‌లో ఉన్న సమస్యలు, కార్యకర్తల సాదకబాధకాలు అడిగి తెలుకున్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశంలో అటు రాష్ట్రంలో ఇటు నియోజకవర్గంలో అద్భుత ప్రగతి సాధింస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఆసరా, ఒంటరి మహిళలకు పెన్షన్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు పేదలకు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మన ప్రభుత్వం ఇంతటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నారు వాటన్నింటిని కార్యకర్తలుగా మనం ప్రజల్లోకి తీసుకుని పోయి క్లుప్తంగా వారికి అర్థమయ్యే విధంగా వివరించాలని ఎమ్మెల్యే కోరారు. గత పాలకులు మన తూర్పు నియోజకవర్గాన్ని కార్మికులు దొరికే కర్కానగా మార్చారని అజాంజాహి మిల్స్ కాంగ్రెస్ వాళ్లు అమ్ముకుని మన బతుకులను మన ఉపాధిని ఆగం చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన బతుకులు మార్చడానికి మనకు బతుకుదెరువు కోసం టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేసారని మన బిడ్డలకు, మనకు ఉపాధి దొరుకుతుందని వచ్చే ఏడాదిలో మన నియోజకవర్గంలో సైతం కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పన జరుపుతామన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశంలో 67 సంవత్సరాలు ఇతర పార్టీలు పరిపాలించాయని కేవలం 8 ఏండ్లలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అద్భుత ప్రగతిని సాధించామని ఎమ్మెల్యే అన్నారు.

వరంగల్ తూర్పును అభివృద్ధిలో నంబర్ వన్‌గా మార్చామని, విద్య, వైద్యంలో భాగంగా 1100 వందల కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విద్యారంగంలో భాగంగా 7 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చామన్నారు. 75 కోట్లతో బస్ స్టేషన్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, వాడవాడన సిసి రోడ్లు, మహిళ కార్మిక భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌తో పాటు మరెన్నో కార్యక్రమాలను తాను ఎమ్మెల్యే అయ్యాక సాదించుకున్నామని పేదల మధ్య కలెక్టరేట్ తీసుకొచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. తనని బద్నాం చేయడానికి చాలా మంది కుట్రలు చేసి తనపై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారని.. వారందరికీ గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, తాను ప్రజల నుండి ఒక్క రూపాయి తీసుకున్న, ఒక్క గజం జాగా కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఓరుగల్లు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా అని ఎమ్మెల్యే తెలిపారు. తాను నిరుపేదల ఎదుగుదలకు రాజకీయాల్లోకి వచ్చానని ఒక పేద బిడ్డగా పేదోళ్ల కష్టాలు తనకు తెలుసని వారి ఎదుగుదలకు అహర్నిశలు శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో నేడు పట్టాలు అందుకుంటున్నామని గత పాలకులు ఈ జీవో 58, 59 అందిపుచ్చుకుని మీ ఇండ్ల స్థలాలకు మిమ్మల్ని హక్కుదారులను చేయాలనే సోయి లేదని, అలాంటి నాయకులు నేడు మీ చుట్టూ మోకరిల్లి దండాలు పెడుతూ.. కల్లబొల్లి వేషాలు వేస్తున్నారని.. అలాంటి వాళ్ళు వస్తే ఆడపడుచులు వారిని నిలదీసి అడగాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పట్టాలను అందిస్తామని చెప్పి నేడు నిరుపేదలందరికి పట్టాలను అందిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఉన్నామని, ప్రజలకు వైద్యం ఏర్పాటు చేశామని ,25 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకున్నామన్నారు.

కార్యకర్తలు బాగుంటేనే పార్టీ బాగుంటుందని, కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అర్హులైన నిరుపేద కార్యకర్తలకు దళితబందు,గృహాలక్ష్మి, డబల్ బెడ్ రూమ్‌లో ప్రాధాన్యం కల్పిస్తామని, ప్రతి కార్యకర్తకు చేదోడు వాదోడుగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ బాటలో నడుస్తూ వారి సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చుతూ.. మనల్ని మన పార్టీని, మన ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసే వారిని నిగ్గదీసి అడగాలని, సోషల్ మీడియా వేదికగా చిల్లర వేషాలు వేస్తున్న బీజేపీ నాయకుల చర్యలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కార్యకర్తలను కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ మావూరపు గీత విజయ్ భాస్కర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కంచర్ల శివ,ఇంచార్జ్ దుబ్బ శ్రీనివాస్,జన్ను ప్రమోద్,జూపాక సురేష్,మైస మొగిలి,రొయ్యల పావని,కృష్ణం రాజు,దామెర లలిత,జన్ను ప్రకాష్,ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Read More:    ‘‘కవితక్క.. మహిళా రిజర్వేషన్ బిల్లు ముచ్చటేమైంది?’’.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం

Tags:    

Similar News