రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: CP రంగనాథ్
నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ శుక్రవారం ప్రజలను సూచించారు.
దిశ, ఎంజీఎం సెంటర్: నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ శుక్రవారం ప్రజలను సూచించారు. తీపి గుర్తులతో గడిచిపోతున్న 2022వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. రానున్న 2023వ సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమనిబంధనలు పాటించాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకోని.. శనివారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 9 గంటల నుండి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ముమ్మరంగా వాహన తనీఖీలు నిర్వహించడంతో పాటు డ్రంక్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తామని, ఇందుకోసం ట్రై సిటీ పరిధిలో మొత్తం యాభైకి పైగా వాహన తనిఖీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కాబట్టి మద్యం సేవించి వాహనం నడపరాదని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహన డ్రైవింగ్ అనుమతించకూడదని, ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలను నడపడంతో పాటు సైలెన్సర్ తొలగించి వాహనాలను నడపటం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే వాణిజ్య సముదాయాలు నిర్ధేశించిన సమయానికి మూసివేయాలన్నారు. డీజేలు, ఇతర శబ్ధ కాలుష్యాన్ని ఏర్పరిచి ఇతరులకు ఇబ్బంది కలిగించే వాటికి అనుమతి లేదని కమిషనర్ తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రమాదం పొంచి ఉన్నందున పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్డు మార్గాలలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోరాదని ఆదేశించారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాల నడుమ ఇండ్లల్లోనే నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని సూచిస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.