నిధుల కేటాయింపుల్లో వివ‌క్ష‌.. ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ వైఖ‌రిపై కౌన్సిల‌ర్ల నిర‌స‌న‌..

మ‌హ‌బూబాబాద్ మునిసిపాలిటీ నిధుల కేటాయింపు విష‌యంలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్, చైర్మ‌న్ పాల్వ‌యి రాంమోహ‌న్‌రెడ్డి వివ‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ అఖిల‌ప‌క్ష కౌన్సిల‌ర్లు నిర‌స‌న‌కు దిగారు.

Update: 2023-04-26 15:17 GMT

దిశ‌, వరంగల్ బ్యురో: మ‌హ‌బూబాబాద్ మునిసిపాలిటీ నిధుల కేటాయింపు విష‌యంలో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్, చైర్మ‌న్ పాల్వ‌యి రాంమోహ‌న్‌రెడ్డి వివ‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ అఖిల‌ప‌క్ష కౌన్సిల‌ర్లు నిర‌స‌న‌కు దిగారు. మహబూబాబాద్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ కేటాయించిన రూ. 50కోట్ల‌ నిధుల్లో వార్డుకు రూ. కోటి కేటాయించాల‌ని కౌన్సిల‌ర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేర‌కు బుధ‌వారం బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సామూహిక నిర‌స‌న దీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి రెడ్డి, సీపీఎం ఫ్లోర్ లీడ‌ర్ సూర్ణపు సోమయ్య, బీఆర్ఎస్ కౌన్సిల‌ర్‌ ఎడ్ల వేణులు విలేక‌రుల‌తో మాట్లాడారు. మునిసిపాలిటీ పాల‌క వ‌ర్గంతో సంబంధం లేకుండా ఏక‌ప‌క్షంగా చైర్మ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని అన్నారు. అలాగే ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ ప్రోటోకాల్ పాటించ‌కుండా, వార్డుల‌తో సంబంధం లేని వ్య‌క్తుల‌తో అభివృద్ధి ప‌నుల్లో పాల్గొంటున్నార‌ని ఆరోపించారు. త‌మ‌ను ఉద్దేశపూర్వ‌కంగా కించ‌ప‌రిచేందుకే ఎమ్మెల్యే చేస్తున్న‌ట్లుగా ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన‌ కౌన్సిలర్లమని మా హక్కులు కాలరాయడం అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు తగదన్నారు.

ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను ఖండించాల్సిన మునిసిప‌ల్ చైర్మన్, ముఖ్య అధికారులు ఆయ‌న‌కు వంత‌పాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు సంవత్సరాలుగా వార్డుల్లో చేసిన అభివృద్ధి ఏంట‌నీ ప్ర‌జ‌లు అ‌డుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు తాము స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నామ‌ని అన్నారు. ఇకనైనా ఏకపక్ష నిర్ణయాలు మానుకొని వెంటనే కౌన్సిలర్లు, అధికారులు కూర్చుని వార్డుల్లో ప్రాధాన్య క్రమంలో పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ నిర‌స‌న దీక్ష‌లో 15 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags:    

Similar News