బీఆర్ఎస్ వైపు స్కీములు - కాంగ్రెస్ వైపు స్కాములు
తెలంగాణలో వచ్చేది కారే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ అని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు.
దిశ, వర్ధన్నపేట : తెలంగాణలో వచ్చేది కారే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ అని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. శుక్రవారం ఐనవోలు మండలం రెడ్డి పాలెం, నందనం, కక్కిరాలపల్లి, పెరుమండ్ల గూడెం, పంతిని, పున్నెలు, ఐనవోలు గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును ప్రజలు నమ్మవద్దని తెలిపారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో మంచినీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్దిచెప్పాలని తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో (బోరింగ్)చేతిపంపు ద్వారా కాడా బిందెల బారులు కనిపించేవని, కానీ మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లానీరు అందుతున్నదని చెప్పారు. రాత్రి పూట కరెంట్ కారణంగా అనేక మంది రైతులు విష పురుగుల కాటు, కరెంట్ షాక్ లకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తుండటంతో ఇప్పుడు రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా అన్నారు. మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకోగలుగుతాం, మన కారు గుర్తుకు ఓటేసి మన సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీ రాములు, జిల్లా రైతు బందు సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.