ములుగులో నకిలీ పోడు పట్టాల కలకలం

ములుగు జిల్లా ములుగు మండలం లో నకిలీ పోడు పట్టాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతుంది.

Update: 2024-10-22 10:12 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలం లో నకిలీ పోడు పట్టాల వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతుంది. గత ప్రభుత్వ హయాంలో అడవి భూములకు భూ హక్కులను కల్పిస్తూ… పోడు పట్టాలను స్థానిక గిరిజనులకు ఇచ్చే సమయంలో ఆయా గ్రామాల్లో దళారులు గిరిజన, గిరిజనేతర్ల వద్ద పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద నుంచి లక్షల్లో వసూలు చేసి నకిలీ పోడు పట్టాలను తయారుచేసి అందించారు. పత్రాలను బ్యాంకు రుణం కోసం తీసుకురావడంతో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ములుగు మండలం అంకన్నగూడెం, కన్నాయిగూడెం, సర్వాపూర్, మదనపల్లి, జాకారం, పొట్లాపూర్, పెగడపల్లి, కాసిందేవి పేట గ్రామాల్లో దాదాపు 350 కు పైగా నకిలీ పోడు పట్టాలు అక్రమార్కులు ప్రజలకు అందించినట్టు తెలుస్తోంది. పోడు భూములకు సంబంధించిన నకిలీ పత్రాలను తయారు చేయడంలో అక్రమార్కులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని ములుగు ఎఫ్ఆర్వో, ములుగు డీఎఫ్ఓ నకిలీ సంతకాలతో పాటు జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని సైతం డూప్లికేట్ తయారుచేసి అసలైన పట్టా కి ఏ మాత్రం తీసుకోకుండా నకిలీ తయారు చేసినట్లు తెలుస్తోంది. దళారులు పోడు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి వందల మంది దగ్గర కోట్లలో డబ్బును వసూలు చేసినట్టు, నకిలీ పోడు పట్టాల బాధితులు ఆయా గ్రామాల్లో ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు.

కూపీ లాగుతున్న ఫారెస్ట్ అధికారులు....

నకిలీ పోడు పట్టాలని ఉపయోగిస్తూ బ్యాంకులలో రుణం తీసుకుంటున్నారని సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు ములుగు జిల్లా కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, కెనరా బ్యాంకులలో పట్టాలను పరిశీలించగా నకిలీ పోడు పట్టాలను గుర్తించారు. బ్యాంకులలో నకిలీ పోడు పట్టాలను ఇచ్చిన వారి సమాచారం తెలుసుకొని గ్రామాలలోకి వెళ్లి ఒక్కొక్కరిగా పట్టాల విషయం కూపీ లాగడంతో వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరికొందరి సహాయంతో నకిలీ పోడు పట్టాలను సృష్టించినట్లు తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారాన్ని తెలుసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటాం : ములుగు ఎఫ్ఆర్వో డోలి శంకర్.

అమాయక ప్రజలను మోసం చేసి నకిలీ పోడు పట్టాలను అందించిన దోషులను అటవీ హక్కుల చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ పట్టాలను తయారు చేసిన వ్యక్తులను వారికి సహకరించిన వారి పై అలాగే జిల్లా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు గాను ఫోర్జరీ కేసులను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాం.


Similar News