ఉపాధి కూలీగా మారిన కలెక్టర్
ఆయన ఓ జిల్లా పాలనాధికారి. ప్రజలతో మమేకమవుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ పలుగు, పార చేత పట్టి కూలీలతో కలిసి పని చేశారు.

దిశ, జనగామ : ఆయన ఓ జిల్లా పాలనాధికారి. ప్రజలతో మమేకమవుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ పలుగు, పార చేత పట్టి కూలీలతో కలిసి పని చేశారు. జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామ శివారులో జరుగుతోన్న ఉపాధి హామీ పథకం కింద ఆర్సీబీ రోడ్డు పనులను పరిశీలించారు. అక్కడ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ స్వయంగా కూలీలతో కలిసి పని చేశారు. అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధిహామీ కూలీ డబ్బులు, పని వేళలు, తదితరాల విషయాలను అడిగారు. ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ 143 మంది ఈ కూలి పనులు చేస్తున్నారన్నారు. ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని తెలిపారు.
రోజుకు రెండు మీటర్ల వెడల్పు, ఒక మీటరు లోతు కొలతలతో పనులు చేస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. అలాగే ఉపాధిహామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను పర్యవేక్షించి అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాగునీరు, ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీఆర్డీఏ వసంత, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎంలు, ఉపాధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.