అకాల వర్షానికి తడిసి ముద్దయిన మిర్చి.. షెడ్డులు ఉన్నా నిరుపయోగంగా మారిన వైనం
ఆరుగాలం శ్రమపడి పండించిన పంట ఒక్కసారిగా వాన నీటిలో తడుస్తుంటే రైతులు గుండెలు బాదుకునే పరిస్థితి ఎనుమాముల మార్కెట్‌లో నెలకొంది..
దిశ, వరంగల్ టౌన్ : ఆరుగాలం శ్రమపడి పండించిన పంట ఒక్కసారిగా వాన నీటిలో తడుస్తుంటే రైతులు గుండెలు బాదుకునే పరిస్థితి ఎనుమాముల మార్కెట్‌లో నెలకొంది. గురువారం ఉదయం వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా మొదలయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు తమ పంట ఉత్పత్తులు తీసుకొచ్చారు. ప్రస్తుతం మిర్చి సీజన్ కావడంతో పెద్దమొత్తంలో 36 వేల వరకు బస్తాలు మార్కెట్‌కు వచ్చాయి. కొనుగోలు ఆలస్యంగా మొదలయ్యాయో.. లేక మార్కెట్‌లో కాంటాలు, బిల్లుల యంత్రాలు మొరాయించాయో ఏమోగానీ కొనుగోళ్లు మధ్యాహ్నం మూడు దాటినా పూర్తి కాలేదు. ఇదే క్రమంలో ఉన్నట్టుండి వాన మొదలైంది. అనుకోకుండా కురిసిన వర్షానికి బస్తాలు మొత్తం తడిసి ముద్దయ్యాయి. సరుకును కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎందుకీ పరిస్థితి..
ఒకపక్క వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాంటాలు వేయడంలో జాప్యంతోనే గురువారం సరుకు వాన పాలైందని పలువురు రైతులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. కళ్లెదుటే ప్రకృతి వైపరీత్యానికి తడిసి ముద్దయిన సరుకును కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ససేమిరా అనడం, ఒకవేళ కొనుగోలు చేసినా బస్తాకు ఐదు కిలోల చొప్పున తరుగు తీస్తామని పేర్కొనడం గమనార్హం. వ్యాపారులు, అడ్తి దారుల తీరుతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. వ్యాపారులు తీసుకురమ్మంటేనే కదా సరుకు తీసుకొచ్చింది.. తీరా తీసుకొచ్చాక కుంటిసాకులతో నష్టం చేయడమేంటని కోపోద్రిక్తులయ్యారు. వ్యాపారుల తీరుపై మార్కెట్ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. చాంబర్ ఆఫ్ కామర్స్,అధికారులు చొరవతీసుకుని రెండు కిలోల తరుగుతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులను ఒప్పించారు.
జాడలేని పాలకవర్గం..
వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా మార్కెట్ అధికారులు రైతులను అప్రమత్తం చేయకపోవడం పలు సందేహాలకు దారితీస్తోంది. వ్యాపారులు, అడ్తి దారులతో కుమ్మక్కై రైతులను దోపిడీ చేయడానికే అధికారులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాన పడే సూచనలు ఉన్నా అడ్తి దారులకు కొనుగోళ్లకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ పలువురు రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకవర్గం మార్కెట్ వైపు కన్నెత్తి చూడకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేసముద్రం మార్కెట్ లో తడిసిన ధాన్యం..
మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. తేమ శాతం తక్కువగా ఉండడంతో ఆరుబయట ఓపెన్ యార్డులో ఆరబోశారు. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. టార్పాలిన్ల తో మక్కల తడవకుండా కాపాడేయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు వెయ్యి బస్తాల మక్కలు తడిసి ముద్దయ్యాయి.