పత్తి రైతు పరేషాన్.. పరకాల మార్కెట్లో కొనుగోళ్లకు సీసీఐ వెనకడుగు
రైతుల ఇంట సిరులు కురిపించాల్సిన తెల్ల బంగారానికి ఆరంభంలోనే
దిశ, పరకాల : రైతుల ఇంట సిరులు కురిపించాల్సిన తెల్ల బంగారానికి ఆరంభంలోనే మద్దతు ధర కరువవుతోంది. పత్తి ధర నేల చూపులు చూస్తూ ఉండడంతో రైతుల్లో కలవరం మొదలైంది. సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందా లేదా అన్న సందిగ్ధం రైతుల్లో నెలకొంది. పరకాల మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు స్వస్తి పలికింది. పరకాల ప్రాంతంలో మూడు పత్తి మిల్లులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా సీసీఐ ప్రయత్నాలు చేస్తుందోలేదోనని రైతులు ఎదురు చూస్తున్నారు. మార్కెటింగ్ శాఖ పత్తి కొనుగోలు కు సిద్ధమైన కూడా సీసీఐ( భారత పత్తి సంస్థ )మాత్రం వెనకడుగు వేస్తుంది.
పరకాల మండల కేంద్రంలో మూడు పత్తి మిల్లులు ఉండగా రైతులు చేతికి వచ్చిన పత్తిని క్వింటాకు రూ.6వేల నుంచి రూ.6700 వరకు అమ్ముకోవడం గమనార్హం. క్వింటాలుకు కేంద్రం మద్దతు ధర రూ.7,521 ప్రకటించగా మార్కెట్లో అంతకు మించి ధర పలుకుతుందని రైతులు ఆశించారు. కానీ దసరా ముందు నుంచే మార్కెట్ కు పత్తి వస్తున్నా సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో తేమను సాకుగా చూపి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండగా కనీస మద్దతు ధర దక్కకుండా పోతున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రోజురోజుకు పత్తి ధరలు పతనం ..
పత్తి ధరలు బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ పతనమవుతున్నాయి. సీసీఐ కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేస్తేనే ధర నిలకడగా ఉంటుందని, ఇంతవరకు చలనం లేకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల మాయాజాలానికి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలను తగ్గించేశారని, పత్తి చేతికి వచ్చే సమయంలో ధరలు దిగజారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల్లోనే క్వింటాకు రూ.1500 నుంచి రూ.2వేల వరకు పడిపోయిందని ఆవేదన చెందుతున్నారు.
రైతుల ఆశలు ఆవిరి ..
ఆగస్టు వరకు పత్తి ధరలు మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లో పత్తి కి మంచి ధర లభిస్తుందని రైతులు నడికూడ, పరకాల మండల గ్రామాల్లో దాదాపు 13 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వేసవిలోనే ఈ ప్రాంతంలో బావుల కింద ముందస్తుగా సాగు చేసిన పత్తి చేతికి వచ్చింది. దిగుబడులు ఆరంభం కావడంతో ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. రికార్డు స్థాయి ధరలను చూసి సాగు చేసిన రైతులు నిరాశకు గురయ్యారు. పత్తి చేతికి వచ్చే సమయంలో ధర పడిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. క్వింటా ధర రూ.2 వేల వరకు పడిపోవడానికి రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సీసీఐ కేంద్రాల ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది దిగుబడి తగ్గింది..: తాళ్లపెల్లి కుమారస్వామి, రైతు, చర్లపల్లి
ఈ ఏడాది అకాల వర్షాలతో పత్తి దిగుబడి తగ్గింది. పత్తి నాణ్యత దెబ్బతినడంతో పాటు వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ శాతం పెరిగింది. ఇంతకుముందు ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.
ఆశించిన ధర లేదు..: గోగుల రవీందర్ రెడ్డి, రైతు, చర్లపల్లి
ముందుగా ఏరిన పత్తికి ధర వస్తుందని ఆశించాం. కానీ తేమ ఎక్కువగా ఉందని క్వింటాలు రూ.6700 చొప్పున 3 క్వింటాళ్లు విక్రయించాం. పత్తి ఏరడానికి కూలీలకు పైసలు లేవు. ఒక మనిషికి రూ.320 కూలీ ఇస్తేనే వస్తున్నారు. ఈ యేడు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.
దీపావళి వరకు ఏర్పాటు చేస్తాం.. : వేణుగోపాల్ రావు, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి
ఈ సంవత్సరం పత్తి కొనుగోళ్లకు సీసీఐ అనుకూలంగానే ఉంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీపావళి వరకు ఏర్పాట్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది.