ఆస్పిరేషన్ పారామీటర్ల నమోదులో జాగ్రత్తలు పాటించాలి

యాస్పిరేషన్ పారా మీటర్ల నమోదులో జాగ్రత్తలు పాటించాల‌ని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు.

Update: 2024-12-30 13:08 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : యాస్పిరేషన్ పారా మీటర్ల నమోదులో జాగ్రత్తలు పాటించాల‌ని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యాన, సంక్షేమ, డీఆర్డీఏ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభరి అధికారి మాట్లాడుతూ… నీతి ఆయోగ్ భూపాలపల్లి జిల్లాను యాస్పిరేషన్ జిల్లా గా ప్రకటించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పారా మీటర్ల నమోదులో వ్యత్యాసం రాకుండా పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. పారా మీటర్ల నమోదు ప్రాముఖ్యతను వివరించారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి డేటా ఖచ్చితత్వం అవసరమని, అందుకు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, వారి విభాగాలకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమాలు, సమస్యలపై ప్రస్తావించారు. అదేవిధంగా, నీతి ఆయోగ్ నుండి అందే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సమీక్ష ద్వారా జిల్లాలో వివిధ రంగాల్లో అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటి అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. భూ సార పరీక్షలు నిర్వహించి భూమికి అనుగుణంగా పంటల సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అంగన్ వాడి కేంద్రాల్లో క్రమం తప్పక బరువు చూస్తూ పిల్లల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అన్నారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల్లో గర్భిణీలు ఆరోగ్య పరిరక్షణకు గ్రూప్ డిస్కస్ ను పెట్టాలని సూచించారు. గృహ సందర్శన ద్వారా నిరంతరం గర్భిణీల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ పై ప్రత్యేక ఫోకస్ చేయాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు అందించాలని తెలిపారు. నూరు శాతం అన్ని గ్రామ పంచాయతీల్లో అంతర్జాల సేవలను అందుబాటులోకి తేవాలని సూచించారు. 5 కి మీ పరిధిలో బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గణపురం మండలం లోని చెల్పూర్ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు. మిల్లెట్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులతో యూనిట్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చు వస్తుంది, అలాగే లాభం ఎంత వస్తుందని అడిగి తెలుసుకున్నారు. మిల్లెట్స్ తో చేసిన ఆహారాన్ని తిని చాలా చాలా బావుందని అభినందించి మిల్లెట్స్ పాకెట్స్ కొనుగోలు చేశారు. వ్యాపారాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ కు సూచించారు. అనంతరం గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. నిర్వహణ బావుందని వైద్యాధికారులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సిపిఓ బాబురావు, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, డిఆర్డీఓ నరేష్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి చిన్నయ్య, వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి, పీఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News