దిశ, ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా కమిషనరేట్పరిధిలో పోలీస్భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంది. హైదరాబాద్‌వంటి మహా నగరంలోని భద్రతా వ్యవస్థను సరిపోలేలా వరంగల్కమిషనరేట్పరిధిలో భద్రతకు ప్రాధాన్యం కల్పించారు. నగరంలో మౌటెండ్ పోలీస్ సెక్యూరిటీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 2017లో అప్పటి అదనపు డీజీ అంజనీ కుమార్ ఖిలా వరంగల్‌లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో గుర్రపుశాల ఏర్పాటు భూమి పూజ చేశారు. కేవలం మూడు నెలల్లో ఈ గుర్రపుశాలను కూడా పూర్తి చేశారు. పోలీసులు గుర్రాలపై స్వారీ చేస్తూ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని ఉద్దేశంతో అదే ఏడాది వరంగల్ కమిషనరేట్‌కు చెందిన కొంత మంది పోలీసులకు హైదరాబాద్‌లో గుర్రపు స్వారీ శిక్షణ కూడా ఇచ్చారు.
కేంద్ర పురావస్తు శాఖ కొర్రీలు..
పోలీస్ శాఖ అనుకున్నట్లుగానే గుర్రపు శాల నిర్మాణం పూర్తి చేసి సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. ఇక అశ్వదళం ప్రారంభించే క్రమంలో ఆ ప్రాంతం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుందని గుర్రపు శాల ప్రారంభోత్సవానికి కొర్రీలు పెట్టింది. దీంతో గుర్రపుశాల ప్రారంభోత్సవం నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులు, పోలీసులు కూడా తగిన చొరవ తీసుకోకపోవడంతో అశ్వదళం ఫైల్ అటకెక్కింది.
ప్రైవేట్ వ్యక్తుల చేతిలో గుర్రపుశాల..
ఖిలా వరంగల్ కోట పరిసర ప్రాంతాలు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి రావడంతో గుర్రపు శాల ప్రారంభోత్సవం అర్ధాంతరంగా ఆగిపోయింది. కానీ, కొంతమంది వ్యక్తులు దీనినే ఆసరాగా తీసుకుని ప్రభుత్వానికి సంబంధించిన గుర్రపు శాలను తమ సొంత వ్యవహారాలకు ఉపయోగిస్తున్నారు. ఏకంగా గుర్రపుశాలకు బర్రెల ఫాంగా మార్చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ప్రభుత్వ భూమిలో డెయిరీ వ్యాపారం చేస్తున్నారు. గుర్రపు శాలనే బర్రెల కొట్టంగా మార్చేసి ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. కబ్జా చేసిన కుటుంబంలోని ఓ వ్యక్తి కేంద్ర పురావస్తు శాఖలో డైలీ వర్కర్‌గా పని చేస్తూ ఆ శాఖ ముఖ్య అధికారిని మచ్చిక చేసుకుని దర్జాగా డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు అధికారుల నిఘా కొరవడడంతో రాత్రి అయితే చాలు గుర్రపుశాల పరిసర ప్రాంతాలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా తయారైంది. అశ్వదశం ఏర్పాటుకు అడ్డు చెప్పిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా డెయిరీఫాం నడుపుతుంటే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని అశ్వదళం ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.