Transfers : బది‘లీల’ బల్దియా
వరంగల్ మహానగర పాలక సంస్థలో బదిలీల ప్రక్రియ మొదలైంది.
దిశ, వరంగల్ టౌన్ : వరంగల్ మహానగర పాలక సంస్థలో బదిలీల ప్రక్రియ మొదలైంది. ఏకంగా 50మందికి ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం బదిలీ చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బల్దియాకు ఉత్తర్వులు అందాయి. అయితే ఓ ఉద్యోగికి అన్యాయం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాశిబుగ్గ సర్కిల్ ల్లో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ను కావాలని బదిలీ చేశారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి సీనియారిటీ ప్రకారం వేరే ఉద్యోగి బదిలీ కావాల్సి ఉంది. అయితే సదరు ఉద్యోగి ఉద్యోగ, ఉద్యమ నేత కావడంతో తన పలుకుబడిని ఉపయోగించి బదిలీ నుంచి తప్పించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో మరో ఉద్యోగికి ట్రాన్స్‌ఫర్ జరిగినట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు బదిలీ జరిగిన ఉద్యోగికి గుండె ఆపరేషన్ అయినట్లు తెలుస్తోంది. కేవలం ఉద్యోగ సంఘం నేత పేరిట బదిలీ కావాల్సిన
ఉద్యోగిని తప్పించి అనారోగ్యంతో ఉన్న ఉద్యోగిని బదిలీ చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి జరిగి ఉంటుందని బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బదిలీ అయిన ఉద్యోగి సీడీఎంను కలిసి తన బాధను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారి ఆయన బదిలీపై పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. బల్దియాలో మొత్తం 50 మంది బదిలీ కాగా,అందులో 26 మంది జిల్లా స్థాయిలో బదిలీ అయినట్లు సమాచారం. వారిలో ముగ్గురు శానిటరీ జవాన్లు, ఇద్దరు పంపు ఆపరేటర్లు, ఒకరు లైన్ మెన్, ఒకరు వాటర్ మెన్, 13 మంది పీహెచ్ వర్కర్లు , ఆరుగురు అటెండర్లు ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సైతం జారీ అయినట్లు తెలుస్తోంది. వీరికి ఈ నెల 31వరకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన బదిలీ ఆదేశాలు కలెక్టర్‌కు అందినట్లు తెలుస్తోంది.
బదిలీపై వెళ్లిన వారిలో....
బల్దియా నుంచి 24 మంది బదిలీపై వెళ్లారు.వారిలో సీనియర్ అసిస్టెంట్ ఇస్రేల్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య ఖమ్మం మున్సిపల్ శాఖకు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పి.సురేష్ పర్కాల్, జె.భీమయ్య ,జి.శ్రీను ఖమ్మం,ఎస్. కరుణాకర్ మహబూబాబాద్, బిల్ కలెక్టర్లు ఎంఏ అజీజ్ , టి.బుచ్చిరాజు,ఈ. స్వర్ణలత,ఎన్.శ్రీనివాస్,ఈ.రమాదేవి, బి.మొగిలి, ఎస్.శ్యామ్, సిహెచ్ సురేందర్, ఏ హేమంత్, జి రవిలు పర్కాల్ మున్సిపాలిటీకి, హెల్త్ అసిస్టెంట్లు ఎస్ కిరణ్ కుమార్ పర్కాల్ , ఈ శ్రీను నర్సంపేట, రామ శ్రీధర్ మహబూబాబాద్, ఎన్.ఎల్ల స్వామి ఖమ్మం, గోనెల రవీందర్ పాల్వంచ, బి. సంపత్ కుమార్, గద్దల శివకుమార్ ఇల్లందు మున్సిపల్ శాఖకు, ఎస్. శ్యామ్ కుమార్ మణుగూరు మున్సిపల్ శాఖలకు బదిలీ అయ్యారు. మొత్తంగా బదిలీల వ్యవహారం బల్దియాలో హాట్‌టాపిక్‌గా మారింది.