అంతా త‌హ‌సీల్దారే చేశాడు..!?

ధృవ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ భారీ అక్ర‌మ వెంచ‌ర్ విహారాపై జ‌న‌గామ జిల్లా ఉన్న‌తాధికారులు ఆరా తీస్తున్నారు.

Update: 2023-02-20 16:06 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఫాం ల్యాండ్ వెంచ‌ర్ ముసుగులో రియ‌ల్ దందా చేస్తున్న ధృవ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ భారీ అక్ర‌మ వెంచ‌ర్ విహారాపై జ‌న‌గామ జిల్లా ఉన్న‌తాధికారులు ఆరా తీస్తున్నారు. జ‌న‌గామ‌జిల్లా దేవ‌రుప్పుల మండ‌లం చిన్న‌మ‌డూరు గ్రామంలో చేప‌ట్టిన భారీ అక్ర‌మ వెంచ‌ర్‌లో జ‌రిగిన రిజిస్ట్రేష‌న్ల‌పై విచార‌ణ మొద‌లైంద‌ని స‌మాచారం. మొత్తం దేవ‌రుప్పుల త‌హ‌సీల్దారే చేసిన‌ట్లుగా ఇప్ప‌టికే పంచాయ‌తీ అధికారులు త‌మ వెర్ష‌న్‌ను ఉన్న‌తాధికారుల‌కు వినిపించిన‌ట్లుగా తెలిసింది. ఈ మేర‌కు అంత‌ర్గ‌త విచార‌ణ మొద‌లైన‌ట్లుగా దిశ‌కు విశ్వ‌స‌నీయంగా తెలిసింది. విహార ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరుతో చేస్తున్న‌ రియ‌ల్ దందాపై ఇటీవ‌ల దిశ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించిన విష‌యం పాఠ‌కుల‌కు విదిత‌మే. ఈనేప‌థ్యంలో అధికారుల వైఖ‌రిని ఎండ‌గ‌డుతూ క‌థ‌నాలు రావ‌డంతో చివ‌రికి స్పందించారు. వెంచ‌ర్ నిర్వాహాకులు డీటీసీపీ లే అవుట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గ‌డువు ఇస్తూ డీఎల్‌పీవో పార్థ‌సార‌థి వెసులుబాటు క‌ల్పించారు. ఇచ్చిన గ‌డువు సోమ‌వారంతో ముగిసిన‌ప్ప‌టికీ మంగ‌ళ‌వార మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కూడా పొడ‌గింపునిచ్చిన‌ట్లుగా దిశ‌కు వివ‌ర‌ణ ఇచ్చారు.

రిజిస్ట్రేష‌న్లపై ఆరా..!

వెంచ‌ర్లో రోడ్ల నిర్మాణం, వాకింగ్ ట్రాక్‌లు, స్విమ్మింగ్ ఫూల్‌, రిసార్ట్‌లు, బంకెట్ హాల్స్ వంటి అధునాత‌న సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా బ్రౌచ‌ర్ల‌లో పేర్కొన్న నిర్వాహాకులు త‌ద‌నుగుణంగానే వెంచ‌ర్లో కొన్ని నిర్మాణాల‌ను సైతం ఆరంభించారు. డీటీసీపీ లేకుండా ఇవ‌న్నీ చేప‌ట్ట‌కూడ‌దు. నాన్ లే అవుట్‌గానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అయితే వెంచ‌ర్‌లో జ‌రుగుతున్న నిర్మాణాలు తెలిసి కూడా, ఒకే స‌ర్వే నెంబ‌ర్‌కు బై నెంబ‌ర్లు వేస్తూ ఫాం ల్యాండ్ ప్రాతిప‌దిక‌న రిజిస్ట్రేష‌న్లు చేసేసిన‌ట్లుగా అధికారుల ద్వారా తెలుస్తోంది. మొత్తం 24 ఎక‌రాల తొలిద‌శ ప్రాజెక్టులో భాగంగా ఇప్ప‌టికే వంద‌కు చేరువ‌లో ప్లాట్ల‌కు బుకింగ్‌లు రాగా, ప‌దుల సంఖ్య‌లో రిజిస్ట్రేష‌న్లు కూడా పూర్త‌యిన‌ట్లుగా తెలుస్తోంది. అక్ర‌మ‌మేన‌ని తెలిసినా త‌హ‌సీల్దార్ రిజిస్ట్రేష‌న్లు పూర్తి చేయ‌డం విశేషం. విహార వెంచ‌ర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన‌వారి ప‌రిస్థితేంటి..? కొనుగోలుదారుల‌కు డ‌బ్బులు తిరిగిచెల్లింపు జ‌రిగేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌డుతారో..? లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News