దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
దేవాలయాలలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గీసుగొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..
దిశ,గీసుగొండ: దేవాలయాలలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని గీసుగొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం రోజు సాయంత్రం మండలంలోని ఊకల్ క్రాస్ రోడ్ వద్ద గీసుకొండ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా హీరో హోండా బైక్ పై కనిపించాడు. అతనిని పట్టుకొని విచారించగా అతడు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన కొలిపాక రాజు అలియాస్ సొల్లు రాజు అని తెలిపాడు. ఇతను 21-09-2024 రోజున గీసుకొండ మండలంలోని గొర్రెకుంట కట్ట మల్లన్న గుడి పక్కన ఉన్న రేణుక ఎల్లమ్మ గుడిలో రాత్రి ఒంటిగంట సమయంలో గుడి తాళాలు పగలగొట్టి గుడిలోకి ప్రవేశించి దేవత బంగారు ముక్కుపుల్ల, బంగారు ముక్కు పోగు,వెండి ముక్కు పుడక,వెండి చంద్రవంక బొట్టు,వెండి చేతి కడెంలను దొంగలించాడని తెలిపారు. ఇతడు గత కొన్ని సంవత్సరాల నుండి దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని కమలాపూర్, గీసుకొండ, ముల్కనూర్ మండలాలలో దొంగతనం చేసి హుండీలను పగలగొట్టి నగదును, దేవుడి బంగారు, వెండి సామాను దొంగలించుకుని పోయాడని తెలిపారు. కొలిపాక రాజు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ మహేందర్ తెలిపారు.