నేనెప్పుడూ కార్మికుల పక్షమే…అజంజాహి కార్మికుల స్థలం వివాదంపై స్పందన

తానెప్పుడూ కార్మికుల పక్షమేనని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు స్పష్టం చేశారు.

Update: 2024-12-19 15:23 GMT

దిశ, వరంగల్‌ టౌన్ : తానెప్పుడూ కార్మికుల పక్షమేనని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావు స్పష్టం చేశారు. వివాదస్పదంగా మారిన అజంజాహి కార్మికుల స్థలం విషయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. ఒక బీసీ నాయకుడిగా ఈ స్థాయికి చేరుకున్నానంటే అది ప్రజల చలవేనని పేర్కొన్నారు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ తనపై కబ్జాదారుడి పేరు లేదని అభిప్రాయపడ్డారు. ఓం నమః శివాయ అనే బట్టల వ్యాపారి తన షాపింగ్‌ మాల్‌ నిర్మాణం విషయంలో తనను హైదరాబాద్‌ లో కలిసినట్లు తెలిపారు. అయితే, రాజకీయ కోణంలోనే ఆయన్ను దగ్గరకు తీసినట్లు పేర్కొన్నారు. అతడిని తాను ఆదరించడం వల్ల కేటీఆర్‌, కేసీఆర్‌, కవిత అతడికి దూరమవుతారనే ఆలోచనతోనే దగ్గరకు తీసినట్లు వెల్లడించారు. అజంజహి గ్రౌండ్‌లోని కార్మిక భవనం స్థలం కుడా పరిధిలో లేదని, ఆ స్థలాన్ని కొండా మురళీ కబ్జా చేశాడని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అది అవాస్తవమని పేర్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో తన ప్రమేయం ఉండదని తెలిపారు. అజంజాహి కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్‌ నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పేదలను ఆదుకోవడమే తప్ప, కబ్జాలకు పాల్పడడం కొండా మురళీ చరిత్రలో లేదని అన్నారు. ఆజంజాహి భూములు జోలికి వెళ్లిన వాళ్ళు అందరు నష్టపోయారని, ఆజంజాహి భూములన్ని పేద కార్మికులకే చెందాలని పేర్కొన్నారు.


Similar News