సమగ్రంగా సర్వే జరగాలి…: జనగామ కలెక్టర్

సమగ్ర కుటుంబ సర్వే కై వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు

Update: 2024-11-06 10:21 GMT

దిశ, జనగామ:సమగ్ర కుటుంబ సర్వే కై వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మొదలగు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సందర్భంగా... మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ, గిర్నిగడ్డ, కుర్మవాడ లో జరుగుతున్న సర్వే తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సర్వే ద్వారా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికి సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని ,అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ,ఆర్థిక, విద్య ,ఉపాధి, రాజకీయ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువలన తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు .జిల్లా వ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈనెల 6 నుండి 8 వరకు ఇండ్లను సందర్శించి ఇండ్ల జాబితాను రూపొందించడం జరుగుతుందని, అనంతరం ప్రభుత్వం ఇచ్చే ఫామ్ ప్రకారం వివరాలను సేకరిస్తారన్నారు.సర్వే ఫారం లో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితుల్లో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే సూపర్వైజర్ల ని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు.ఇండ్ల జాబితా తయారీ సందర్భంగా..ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని చెప్పారు.సర్వే ఫారం లో పూర్తి వివరాలను నింపాలని , ప్రతి ఇంటికి వెళ్లి సేకరించిన డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News