ఎమ్మెల్యే గండ్ర‌కు షాకిచ్చిన కౌన్సిల‌ర్లు..

భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డికి బీఆర్ ఎస్ పార్టీ మునిసిపాలిటీ కౌన్సిల‌ర్లు షాకిచ్చారు.

Update: 2023-04-19 13:57 GMT

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర ర‌మ‌ణారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ మునిసిపాలిటీ కౌన్సిల‌ర్లు షాకిచ్చారు. మునిసిపాలిటీ చైర్‌ప‌ర్స‌న్ సెగ్గెం వెంక‌ట రాణి, వైస్ చైర్మ‌న్ కొత్త హ‌రిబాబుల‌ను ప‌దవుల నుంచి తొల‌గించ‌కుంటే తాము బీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తామ‌ని బుధ‌వారం ఎమ్మెల్యేను ఆయ‌న క్యాంప్ ఆఫీసులో ఆయన్ను క‌లిసి వినతిపత్రం అందించారు. అయితే కౌన్సిల‌ర్ల డిమాండ్‌ను ఎమ్మెల్యే అంగీక‌రించలేదు కదా విన‌తిప‌త్రం కూడా తీసుకునేందుకు నిరాక‌రించారు.

ఇకపోతే చైర్‌ప‌ర్స‌న్‌, వైస్‌చైర్మ‌న్ల‌ పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కోరుతూ భూపాల‌ప‌ల్లి అద‌న‌పు క‌లెక్ట‌ర్‌కు 20మంది బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విన‌తిపత్రం అంద‌జేశారు. కౌన్సిల‌ర్ల నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ మీరు ఆదేశిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో చైర్‌ప‌ర్స‌న్‌, వైస్‌చైర్మ‌న్లు ఎమ్మెల్యేకు లేఖ రాశారు. ఆ లేఖ‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో కూడా అంద‌జేశారు. బుధ‌వారం రోజంతా చ‌ర్చ‌లు కొన‌సాగిన కౌన్సిల‌ర్లు త‌మ డిమాండ్ నుంచి వెనక్కి త‌గ్గ‌లేదు. ఎమ్మెల్యే గండ్ర సైతం ఆ ఇద్ద‌రికే మ‌ద్దతుగా ఉంటున్నార‌న్న ఆగ్ర‌హం కౌన్సిల‌ర్ల‌లో వ్య‌క్త‌మైంది. ఇక తాడోపేడో తేల్చుకోవాల‌నుకుని పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఇదే విష‌యంపై ఎమ్మెల్యేకు తెలుపుతూ లేఖ రాసి ఆయ‌న‌కు అంద‌జేసేందుకు బుధ‌వారం సాయంత్రం క్యాంపు కార్యాల‌యంలోకి వెళ్లారు. అయితే కౌన్సిల‌ర్ల నిర్ణ‌యంతో ఎమ్మెల్యే విబేధించ‌డంతో పాటు ఒంకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా కౌన్సిల‌ర్ల ద్వారా తెలుస్తోంది.

కౌన్సిల‌ర్లు వ‌ర్సెస్ చైర్మ‌న్‌, వైస్‌చైర్మ‌న్‌లుగా కొన‌సాగుతున్న రాజ‌కీయ యుద్ధం ముదిరి పాక‌న ప‌డింది. ఇప్పుడు భూపాల‌ప‌ల్లి మునిసిపాలిటీ సంక్షోభం ఎమ్మెల్యే గండ్ర మెడ‌కు చుట్టుకునేట్టు క‌నిపిస్తోంది. క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం.. విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న చ‌దంగా.. కౌన్సిల‌ర్ల డిమాండ్‌కు త‌లొగ్గాలా..? కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన మీరే మాకు అన్నీ అంటున్న చైర్ ప‌ర్స‌న్‌, వైస్ చైర్మ‌న్లకు అండ‌గా నిల‌బ‌డాలో తెలియ‌క ఎమ్మెల్యే స‌త‌మ‌వుతున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టికే అస‌మ్మ‌తి ఉంద‌న్న‌ప్ర‌చారం, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా బ‌లోపేతంగా ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో మునిసిప‌ల్ సంక్షోభం ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని తెచ్చి పెట్టింద‌నే చెప్పాలి.

Tags:    

Similar News