కేంద్రం రిప్లై కోసం వెయిటింగ్: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నగరంలో మెట్రో ఫేస్ 2 కోసం కేంద్రానికి రెండు డీపీఆర్‌లు పంపామని.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలో మెట్రో ఫేస్ 2 కోసం కేంద్రానికి రెండు డీపీఆర్‌లు పంపామని.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మెట్రోపై విజన్తో ఉన్నారని అన్నారు. హయత్నగర్ వరకూ మెట్రో ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారని తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశను కూడా చేయాలని సీఎం అన్నారని.. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు మెట్రో ప్రారంభిస్తామని మెట్రో ఎండీ వెల్లడించారు. ఆలోపు రూ.6250 కోట్ల బడ్జెట్‌తో రాయ్‌దుర్గ్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో లైన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అన్నారు.
ఎయిర్ పోర్ట్ రూట్‌లో మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామని, మెట్రో ఫేజ్1 విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. మెట్రోలో 31 కోట్ల 50 లక్షల మంది ప్రయాణించారని, 3,834 కిలోమీటరు ఇప్పటి వరకు మెట్రో తిరిగిందని పేర్కొన్నారు. 9.2 కోట్ల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అయిందని వివరించారు. ఫస్ట్ ఫేస్‌లో స్టేషన్‌ల విషయంలో తాము 370 కేసుల్ని ఎదుర్కున్నామని.. చాలామంది తమని రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు.