పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే 'విజిట్ ఇండియా 2023': Kishan Reddy

కరోనానంతర పరిస్థితుల్లో దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా కేంద్ర ప్రభుత్వం మౌలికవసతుల కల్పనతో పాటుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

Update: 2023-02-08 15:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనానంతర పరిస్థితుల్లో దేశ పర్యాటకాన్ని పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి పెరిగేలా కేంద్ర ప్రభుత్వం మౌలికవసతుల కల్పనతో పాటుగా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో పర్యాటక అభివృద్ధికి 'విజిట్ ఇండియా-2023' నినాదంతో ముందుకెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రైవేట్ రంగం, ఇతర భాగస్వామ్య పక్షాలు, ప్రజలు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి కల్పనకు విస్తృతమైన అవకాశం ఉన్న పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో 'గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్'ను నిర్వహించనున్నట్లు తెలిపారు. 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా అన్ని జీ20 సభ్యదేశాలు కృషి చేయాలని సూచించారు.

40 యునెస్కో చారిత్రక కేంద్రాలు, 14 యునెస్కో ఇన్ టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఎలిమెంట్స్, ఆధ్యాత్మిక కేంద్రంగా, నాలుగు ధర్మాలకు పుట్టినిల్లుగా(హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం), ఎన్నో రకాల పండుగలు, ఉత్సవాలకు కేంద్రంగా భారత్​ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును పొందిందని కొనియాడారు. దేశంలో పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు గత ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు 7వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పర్యటించే దేశీయ, విదేశీ పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా యూనిఫాం టూరిజం పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తం రూపాలా, గుజరాత్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి మునుభాయ్ బేరా తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News