నిరుద్యోగుల జీవితాలతో TSPSC చెలగాటం: VJS
నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో TSPSC బోర్డు చెలగాటం ఆడుతుందని విద్యార్థి జన సమితి(వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో TSPSC బోర్డు చెలగాటం ఆడుతుందని విద్యార్థి జన సమితి(వీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని TSPSC నిర్లక్ష్యంతోనే (టీపీవో) పేపర్ లీకైందని, దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో హ్యాక్ అని లీకులు ఇచ్చారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తన వ్యక్తిగత అవసరాల కోసం TSPSC కార్యదర్శి పీఏ ప్రవీణ్ పేపర్ లీక్ చేసే దుస్థితికి TSPSC ని కేసీఆర్ ప్రభుత్వం దిగజార్చిందని అన్నారు.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ లీక్ ఘటన వెనుక ప్రవీణ్ కుమార్‌తో పాటు TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌తో పాటు సభ్యుల అందరి మీదా విచారణ జరిపించాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రహస్యంగా, పారదర్శకంగా, ఉండే సమాచారాన్ని ఒక సాధారణ ఉద్యోగి ఎలా లీక్ చేస్తాడని, దీని వెనుక TSPSC చైర్మన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. లక్షల మంది ఉద్యోగాల కోసం కష్టపడి ప్రిపేర్ ఆవుతుంటే.. వ్యక్తులు పేపర్ లీక్‌లు చేసే స్థాయికి TSPSC ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందన్నారు. అలాగే ఈ ఘటన మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సర్దార్ వినోద్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి, నిరుద్యోగులతో కలిసి టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు.