Vem Narender :మూసీకి సియోల్ హాన్ నదికి దగ్గర పోలికలు.. వేం నరేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా దక్షిణ కొరియా సియోల్ నగరంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-22 14:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా దక్షిణ కొరియా సియోల్ నగరంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఆయన మంగళవారం ఆసక్తికర విషయాలు మీడియాకు తెలిపారు. సౌత్ కొరియా సియోల్ నగరంలోని హన్ రివర్, పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడ అవలంభించిన పద్ధతులను మూసీ ప్రక్షాళన ప్రక్రియలో ఉపయోగించడం జరుగుతుందని నరేందర్ రెడ్డి తెలిపారు. హాన్ రివర్‌ను బేస్ చేసుకోని సియోల్‌లో అభివృద్ధి జరిగిందన్నారు. సియోల్ నగరం, రాష్ట్రం హాన్ రివర్ వల్ల ఆర్థికంగా డెవలప్ అయిందన్నారు. హైదరాబాద్ పట్టణానికి రకరకాల ఇబ్బందులు వచ్చాయని, గత ప్రభుత్వం చేయని పని, ప్రజా ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో హైదరాబాద్ ముఖ్యమైన పట్టణం కాబట్టి దాన్ని టూరిజం రంగంలో అభివృద్ధి చేసేది ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆలోచన అని చెప్పారు.

సియోల్‌లో ప్రవహించే హాన్ నది.. మూసీ నదికి దగ్గర పోలికలు ఉన్నాయని, హాన్ నది పట్టణ ప్రాంతంలో 75 కిలోమీటర్లు ప్రవహిస్తోందని చెప్పారు. మన దగ్గర మూసీ నది 55 కిలోమీటర్లు ప్రవహిస్తోందని తెలిపారు. మూసీ రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న పేదలకు న్యాయం చేయాలనే చూస్తున్నామని అన్నారు. అందుకు రూ.30 లక్షలు విలువ చేసే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఆర్థిక సహాయం, మౌళిక సదుపాయాలు ఇస్తున్నామని, వారిని ఒప్పించి, మెప్పించి కాలీ చేయిస్తున్నామని, కానీ ఉక్కుపాదం మోపడం లేదన్నారు. అందరినీ ఒప్పించి మెప్పించి మూసీ పునరుజ్జీవం చేపడతామని చెప్పుకొచ్చారు.


Similar News