ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అర్బన్ ఎఫెక్ట్.. వారం రోజుల్లో మారిన పరిస్థితి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని ‘తెలంగాణ ఆవాజ్’ అనే సంస్థ అంచనా వేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని ‘తెలంగాణ ఆవాజ్’ అనే సంస్థ అంచనా వేసింది. ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన(ఏప్రిల్ 13) తన వీక్లీ సర్వే ఫలితాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సర్వే సంస్థ అంచనా ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ 6-8 స్థానాలు, బీజేపీ 5-7 స్థానాలు బీఆర్ఎస్ 2-4 స్థానాలు, ఇతరులు 0-7 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నువ్వానేనా.. అన్నట్లుగా రాజకీయం నడుస్తున్న వేళ ఈ సర్వే ఫలితాలు ఆసక్తిని రేపుతున్నాయి.
కాస్త తగ్గిన హస్తం హవా..!
ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 29.8శాతం ఓటు షేరింగ్, బీజేపీకి 28.6, బీఆర్ఎస్‌కు 24.3, తటస్థులు 12.3, ఇతరులకు 4.9 శాతం ఓటు షేరింగ్ ఉండబోతున్నదని వెల్లడించింది. అయితే ఈ వారంలో కాంగ్రెస్ ఓట్ల శాతం కాస్త తగ్గి, బీఆర్ఎస్‌కు ఓటు శాతం కాస్త పెరిగినట్లు ఈ వారం సర్వేలో వెల్లడించింది. ఇక బీజేపీ, ఇతర పార్టీల ఓట్ల శాతంలో పెద్దగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నదని పేర్కొంది. గత వారం కాంగ్రెస్ 7-9 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండగా ఈ వారం ఆ స్థానాల సంఖ్య 6-8కి తగ్గిపోయింది. బీజేపీ గత వారంలాగే 5-7 స్థానాల్లో గెలిచే అవకాశాలను కంటిన్యూ చేస్తోందని పేర్కొంది. అనూహ్యంగా ఈ వారం సర్వేలో బీఆర్ఎస్ ఒక స్థానం పుంజుకుని 2-4 స్థానాల్లో గెలుపు అవకాశాలను నమోదు చేసుకుంది. ఇక హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం తన పట్టు నిలుపుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని తేల్చింది.
కాంగ్రెస్‌కు అర్బన్ ఎఫెక్ట్
రాబోయే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు పట్టణ ప్రజలు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. వేసవిలో ఏర్పడే పలు సమస్యలకు పాలనా పరమైన వైఫల్యాలే కారణంగా భావించి పట్టణ ప్రాంత ఓటర్లలో మార్పు కనిపిస్తోందని పేర్కొంది. అందువల్లే అధికార కాంగ్రెస్‌కు ఓటు శాతం తగ్గిపోతున్నట్లు అంచనా వేసింది. అయితే ఇటీవల ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ కావడానికి కూడా ఓ రీజన్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా చేరికల విషయంలో సొంత పార్టీలోనే కుంపట్లు రేగడం, వేసవిలో నీటి సమస్య, మాదిగ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వంటి అంశాల్లో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయనే టాక్ పొలిటికల్ కారిడార్‌లో వినిపిస్తోంది.