పరిష్కారం కాని ‘ధరణి’ దరఖాస్తులు.. సొల్యూషన్స్ ఉన్నా.. ససేమిరా!

ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నది.

Update: 2024-05-15 02:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నది. కమిటీ ఏర్పాటు చేసినా.. స్పెషల్ డ్రైవ్ చేపట్టినా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అప్లికేషన్లకు మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ధరణి కమిటీ భేటీ కానున్నది. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పదేండ్లుగా సాగిన అక్రమ భూ దందాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ భేటీలో దీనిపైనా డిస్కషన్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా కొత్త ఆర్వోఆర్ చట్టం అంశం కూడా ఎజెండాలో ఉన్నట్లు తెలిసింది.

స్పెషల్ డ్రైవ్ చేపట్టినా..

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి గత మార్చిలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అయితే అప్పుడు అధికారులు డ్యాష్ బోర్డు క్లియర్ చేశారే తప్పా సమస్యలు పరిష్కరించలేదనే చర్చ జరుగుతున్నది. తహశీల్దార్లు నివేదికలు (అప్రూవ్ ఆర్ రిజెక్ట్) పంపి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా టీఎం 15, టీఎం 33 అప్లికేషన్లు ఒక్కటి కూడా అప్రూవ్ చేయనట్లు తెలిసింది. వాటికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ సమయం ఎక్కువగా పడుతుందన్న నెపంతో రిజెక్ట్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

కమిటీ సూచించినా..

ఎన్నికల్లోపే ధరణిలో పెండింగ్ అప్లికేషన్లను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి గతంలోనే అధికారుల ను ఆదేశించారు. కానీ సీసీఎల్ఏ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో టీఎం 15, టీఎం33 మాడ్యూళ్ల కింద వచ్చిన అప్లికేషన్లపై ఎడతెగని జాప్యం నడుస్తున్నది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల్లో టీఎం 33 కింద అప్లికేషన్లు వేలల్లో వచ్చాయి. పట్టణ ప్రాంత శివార్లలోనే ఈ సమస్య అధికంగా ఉంది. భూమి విలువ రూ.కోట్లకు చేరడంతో ఈ సమస్య తీవ్రమైంది.

ఎజెండాలో పలు అంశాలు!

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భేటి ఉంటుం దని, ఎక్కడ, ఎలా నిర్వహించాలనే దానిపై ఇంకా ని ర్ణయం తీసుకోలేదని ధరణి కమిటీ సభ్యుడొకరు ‘దిశ’కు తెలిపారు. అంతేకాకుండా ఈ భేటిలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలి సింది. తెలంగాణలో 2014 నుంచి సాగిన భూ దం దాలు, అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం కొంద రు అధికారులను ప్రత్యేకంగా నియమించింది. వాటన్నింటినీ క్రోడీకరించి శ్వేతపత్రం విడుదల చేయాలనుకుంటున్నది. శ్వేతపత్రంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. దీంతోపాటు కొత్త ఆర్వోఆర్ చట్టంపై కూడా డిస్కషన్ చేసే అవకాశముంది.

టీఎం 33తోనే అసలు సమస్య

ధరణి పోర్టల్, అప్ లోడ్ చేసిన డేటా సృష్టించిన సమస్యలే అధికం. టీఎం 33 కిందికి వచ్చే సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు ఆసక్తి చూపడం లేదు. ఆఖరికి రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ లోనూ అదే ఆర్ఎస్ఆర్ డిఫరెన్సు అంటూ పెండింగ్ పెట్టారు. రికార్డ్స్ వెరిఫై చేసి ఎవరి ఖాతాలో విస్తీర్ణం ఎక్కువగా నమోదు అయ్యిందో, ఎవరు అమ్మేసినా రికార్డుల్లో కొనసాగుతుందో పరిశీలిస్తే పరిష్కారం సాధ్యమే. కానీ పాత రికార్డులను వెరిఫై చేసే తీరిక, ఓపిక రెవెన్యూ సిబ్బందికి లేదు. అందుకే డేటా కరెక్షన్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో తప్పులను సవరించకుండా ఏకపక్షంగా రిజెక్ట్ చేస్తున్నారు.

ఆఖరికి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రికార్డుల్లోని విస్తీర్ణం మేరకు దరఖాస్తుదారుడు కబ్జాలో ఉన్నాడా? లేడా? అన్న విషయాన్ని కూడా పరిశీలించేందుకు ససేమిరా అంటూ పెండింగ్ పెడుతుండడంతో రైతుల్లో అసహనం పెరుగుతున్నది. అన్ని రికార్డులు, మోఖా చూసిన తర్వాత కొనుగోలు చేసిన వారికే ఈ సమస్య అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాస్ బుక్ లో ఉండి, రికార్డుల్లో లేకపోవడంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దరఖాస్తు పెట్టుకున్న ఏ ఏడాదికో రిజెక్ట్ చేస్తున్నారే తప్ప రికార్డులను పరిశీలించి వాస్తవాలతో కూడిన రిపోర్ట్ ని సమర్పించేందుకు తహశీల్దార్లు సిద్ధంగా లేకపోవడం వల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యానికి గండి పడుతున్నది.

కొత్త చట్టంపైనా చర్చ

కేసీఆర్ హయాంలో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉందని, అనేక సమస్యలకు పరిష్కారమే లేదని, చట్టబద్ధత లేకుండానే అధికారాలను కట్టబెట్టారని ధరణి కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఇదే అంశంపై ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టంపై దాఖలు చేసిన పిల్ హైకోర్టులో నడుస్తున్నది. ఈ క్రమంలో సరికొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఆ బాధ్యత కమిటీకే అప్పగించాలా? మరొకరికి కట్టబెట్టాలా? అన్న చర్చ అధికార వర్గాల్లోనూ నడుస్తున్నది.

కేంద్ర, పలు రాష్ట్రాల ఆర్వోఆర్, ఇతర భూ చట్టాలను రూపొందించిన నైపుణ్యత ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ కి ఉన్నది. ఆయనకే ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ ఉన్నది. ఏపీలోనూ ల్యాండ్ టైటిల్ గ్యారంటీ చట్టాన్ని రూపొందించింది కూడా ఆయనే కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేయాలన్న సూచనలు చేసింది. ఈ క్రమంలోనే ఏపీలో అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. తెలంగాణలో ధరణి సృష్టించిన సమస్యలను ఓ కొలిక్కి తీసుకురావడానికి సరికొత్త ఆర్వోఆర్ చట్టానికి అడుగులు వేసే అవకాశం ఉన్నది.


Similar News