రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా పొడిగిస్తాం.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. గురువారం తెలంగాణ, కర్నాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు భేటీ అయ్యారు.ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చ జరిపారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిలపై సమావేశంలో చర్చించారు. సమస్యలను ఎంపీలు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచామని గుర్తుచేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందేభారత్ రైళ్లు ఉన్నాయన్నారు. అంతేకాదు.. మరిన్ని రైళ్లు తీసుకొస్తామని ప్రకటించారు. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు.