ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మోడీ 3.0 కేబినెట్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది.

Update: 2024-06-10 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: మోడీ 3.0 కేబినెట్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఈ క్రమంలో తనకు బొగ్గు గనుల శాఖ కేటాయిండంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బొగ్గు గనుల శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భావిస్తున్నానని, ప్రధాని మోడీ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మరోసారి తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. బొగ్గు గనుల శాఖపై పూర్తిగా అవగాహన పెంచుకుని నా విధులు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బొగ్గు, గనులు దేశానికి ఆదాయం తీసుకువచ్చే శాఖలు అని అన్నారు. మోడీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని.. ఇవాళ విద్యుత్ కోతలు లేని దేశాన్ని మోడీ ఆవిష్కరించారని కొనియాడారు. దేశంలో రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలంటే బొగ్గు కీలకమని అన్నారు. ఇక, కీలకమైన శాఖల్లో పాత మంత్రులే కొనసాగుతారని స్పష్టం చేశారు. 100 రోజుల కార్యచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. 


Similar News