ఆ దాడి దురహంకారం.. అధికార పార్టీపై కిషన్ రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-10-20 15:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటున్న మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు సరైన డైరెక్షన్ లేదని, నదిలో కలుస్తున్న పారిశ్రామిక, మానవ వ్యర్థాలను నిలువరించేలా డ్రైనేజీ సిస్టమ్‌ను సరిచేయకుండా నది సుందరీకరణ ఎలా సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బ్యూటిఫికేషన్ పేరుతో మూసీ ఒడ్డున ఉన్న పేదల ఇండ్లను కూల్చవద్దని ప్రభుత్వానికి సూచించారు. పేద కుటుంబాలు రోడ్డున పడితే బీజేపీ సైలెంట్‌గా ఉండదని, వారి పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు మూడు రోజులుగా అశోక్‌నగర్‌లో నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని, జీవో 29 ద్వారా వారికి కలిగే నష్టంపై ఆందోళన చెందుతున్నారని, వారి సందేహాలను నివృత్తి చేయడానికి చర్చలకు పిలవాలని రిక్వస్టు చేశారు. నాంపల్లిలోని స్టేట్ పార్టీ ఆఫీసులో ఆదివారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విగ్రహం ధ్వంసం విషయమై సికింద్రాబాద్‌లో హిందు కార్యకర్తలు నిరసనలు చేస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తప్పుపట్టారు.

నిరుద్యోగ యువత వారం రోజులుగా అశోక్‌నగర్‌లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, వారి అనుమానాలను నివృత్తి చేయడంలో సీఎం మాటలు సచివాలయం గేటు దాటటడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు, రైతాంగానికి, పేదలకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. సీఎం కాకముందు నిరుద్యోగులకు అనేక మాటలు చెప్పినా ఇప్పుడు వారి ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని ప్రస్తావించారు. సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి వారికి ఉద్యోగాల గురించి ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్... ఇప్పుడు పోలీసులతో లాఠీచార్జీ చేయించడాన్ని తప్పుపట్టారు. వారంతా తెలంగాణ బిడ్డలేనని, వారిని పిలిపించుకుని చర్చిస్తే వచ్చే నష్టమేముందని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవలంభిస్తుందన్నదనేది రెండు రోజుల పరిణామాలను చూస్తే స్పష్టమవుతుందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా నిరుద్యోగ యువతకు ఆందోళన తప్పడంలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ఉద్యోగాలను భర్తీ చేయాలనే చిత్తశుద్ధి నిజమే అయితే ముఖ్యమంత్రి వెంటనే నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్థులతో మాట్లాడాలని కిషన్‌రెడ్డి సూచించారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఎన్నికలకు ముందు స్వయంగా అక్కడకే వెళ్లగా ఇప్పుడు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. ధైర్యం లేకపోతే పోలీసులను వెంట బెట్టుకొని వెళ్లి చర్చించాలన్నారు. ఆందోళన, ధర్నా, నిరసన చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 మార్గదర్శకాల్లో అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయని, దాపరికం లేకపోతే పిలిచి మాట్లాడడంలో అభ్యంతరమేమున్నదన్నారు. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తే వారిపై పోలీసులు విరుచుకుపడడం బాధాకరమన్నారు. అక్రమ జీవోలు, అక్రమంగా ఇళ్ల కూల్చివేతలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తూ హామీలను అమలు చేయడం నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకున్నదని ఆరోపించారు. కొత్త సమస్యలు సృష్టించి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్న చేస్తున్నదని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందు దేవాలయాల పక్కన మరో మతానికి చెందిన మోటివేషన్ క్లాసులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరసన తెలుపుతున్న హిందూ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడడం సహించరానిదన్నారు. హిందువుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటేనన్నారు. ముత్యాలమ్మ దేవాలయం ధ్వంసం విషయంపై హిందూ సంఘాలపై పోలీసుల దౌర్జన్య దమనకాండ, అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులపై లాఠీచార్జీ కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార ధోరణి, దురహంకారానికి నిదర్శనమన్నారు. దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా... హిందు నిరసనకారులు టెర్రరిస్టులా.. అని వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయంపై దాడి జరిగితే సీఎం, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. 


Similar News