నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి : సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

పంతాలు పట్టింపులకు పోకుండా గ్రూప్-1 అభ్యర్థుల మానసిక ఆందోళనను సహృదయంతో అర్థం చేసుకుని మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూలు చేయాలని, ప్రభుత్వం జారీచేసిన జీవో 29ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రిక్వెస్టు చేశారు.

Update: 2024-10-20 16:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పంతాలు పట్టింపులకు పోకుండా గ్రూప్-1 అభ్యర్థుల మానసిక ఆందోళనను సహృదయంతో అర్థం చేసుకుని మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూలు చేయాలని, ప్రభుత్వం జారీచేసిన జీవో 29ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రిక్వెస్టు చేశారు. ఆందోళన చేస్తున్నవారంతా మన తెలంగాణ బిడ్డలేనని, జీవో 29 ద్వారా రిజర్వేషన్లకు విఘాతం కలుగుతున్నదని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెలువడిన ఉత్తర్వు అని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరికొన్ని గంటల్లో పరీక్షలు జరగబోతున్నా అభ్యర్థులు అశోక్‌నగర్, గాంధీనగర్‌లో ఆందోళనలు చేస్తున్నారని, వారి ఆవేదనలోని న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని వారి భవిష్యత్తు కోసం పాజిటివ్‌గా స్పందించాలని కోరారు. జీవో కారణంగా సుమారు 5 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశాలు చేజారుతాయని, 1:50 నిష్పత్తి సహేతుకమైనది కాదని పేర్కొన్నారు. నిరుద్యోగులంతా మన కుటుంబ సభ్యులనే భావనతో సానుకూలంగా స్పందించాలని కోరారు. అభ్యర్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపి శనివారం వారితో కలిసి సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించినా.. మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేసిన మరుసటి రోజున బండి సంజయ్ ఈ లేఖ రాశారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 354 రిజర్వు అయ్యాయని, జీవో-29 కారణంగా ఎక్కువ మార్కులు సాధించి మెరిట్ కనబరిచిన రిజర్వుడు విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో అవకాశాలు పొందలేకపోతారని పేర్కొన్నారు. మొత్తం 563 పోస్టుల్లో 354 ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ఇతర రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఉంటాయని, అవి పోగా మిగిలిన 209 పోస్టులకు 1:50 నిష్పత్తి చొప్పున టాప్ 10,450 ర్యాంకులు సాధించిన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. టాప్ మార్కులు సాధించేవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా ఉండొచ్చని, ఈ ర్యాంకులు సాధించిన వారిని మినహాయించి 354 రిజర్వ్ పోస్టులకు 1:50 నిష్పత్తి చొప్పున 17700 మంది రిజర్వ్ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం యూపీఎస్సీసహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించే పబ్లిక్ సర్వీష్ కమిషన్లు దశాబ్దాల నుండి అనుసరిస్తున్న విధానమని గుర్తుచేశారు.

కానీ జీవో 29 ప్రకారం... మొత్తం 563 పోస్టుల్లో రిజర్వ్ కేటగిరీలతో సంబంధం లేకుండా 1:50 నిష్పత్తి ప్రకారం (563X50) మొత్తం 28,150 ర్యాంకులు సాధించిన వారందరినీ గంపగుత్తగా ఎంపిక చేయాల్సి వస్తుందన్నారు. ఓపెన్ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే కలిపేయాల్సి ఉంటుందన్నారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తక్కువ పడినట్లయితే 28,150 తర్వాతి ర్యాంకు నుంచి తీసుకోవాల్సి వస్తుందని, దీనివల్ల దీనివల్ల 5003 మంది రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు అవకాశం లేకుండా నష్టపోతారని తెలిపారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 1:65 నిష్పత్తిని జీవో 29లో పేర్కొనడమే ఇందుకు కారణమన్నారు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ పాలసీకి భిన్నమైనదని, రాజ్యాంగ స్పూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. దీంతో దాదాపు 30% ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలవుతారని అన్నారు. ఈ కారణంగానే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొన్నదని గుర్తుచేశారు.

తీవ్రమైన మానసిక వేదనలో ఉన్న అభ్యర్థులు బాధను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూలు చేయడంతో పాటు జీవో-29ను ఉపసంహరించుకోవాలని ఆ బహిరంగ లేఖలో సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ రిక్వెస్టు చేశారు. ఈ జీవోను చూసిన తర్వాత భవిష్యత్తులో మొత్తం రిజర్వేషన్లనే ప్రభుత్వం ఎత్తివేయబోతుందేమోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. 


Similar News