తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. అసలు బీజేపీ హైకమాండ్ దృష్టిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఆలోచనే లేదని స్పష్టం చేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలన్నీ ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మార్పు అంటూ కొందరు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. అసలు ఈ వార్తలు ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదన్నారు. దీనికి సంబంధించి బీజేపీ కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని.. ఇది కేవలం మీడియా సృష్టించిన గందరగోళమేనని పేర్కొన్నారు. ఇక, ఒకరిద్దరు పార్టీలో చేరనంతమాత్రాన నష్టం ఏం లేదని పొంగులేటి, జూపల్లి గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
కాగా, గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కొత్త వారిని నియమిస్తారని జోరుగా వార్తలు వినిపించాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి.. ఆయన స్థానంలో బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని సైతం వార్తలు వినిపించాయి. కాగా, కిషన్ రెడ్డి తాజా కామెంట్స్‌తో ఈ వార్తలకు తెర పడింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సైతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని ఇవాళ స్పష్టం చేశారు.