‘అక్బర్.. పాతబస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా..?’.. కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్

రాత్రి 10 దాటితే ఓల్డ్ సిటీలోకి పోలీసులు రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడని, పాతబస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా..? లేక పాతబస్తీ

Update: 2024-07-29 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాత్రి 10 దాటితే ఓల్డ్ సిటీలోకి పోలీసులు రావద్దని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడని, పాతబస్తీ ఏమైనా ఓవైసీ జాగీరా..? లేక పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్‌లో ఉందని ఆయన భావిస్తున్నాడా..? లేక ఇంకా నిజాం రజాకార్ల పాలనే కొనసాగుతుందని అనుకుంటున్నాడా..? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎవరో ఒక పోలీస్ తప్పు చేస్తేమొత్తం పోలీస్ వ్యవస్థను, పోలీసుల ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సిగ్గుచేటని ఫైరయ్యారు. పాతబస్తీలో ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం గుండాలపై పోలీసులు చట్ట ప్రకారం తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు.

రాత్రి 10 తర్వాత ఓల్డ్ సిటీలో తానే ఉంటానని, పోలీసులు ఎట్లా వస్తారో చూస్తానని అక్బరుద్దీన్ బెదిరింపులకు దిగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు. రాత్రిపూట గుంపులు గుంపులుగా చేరి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా.. బండ్లపై తిరుగుతూ రోడ్లమీద న్యూసెన్స్ క్రియేట్ చేసినా.. వారిని అడ్డుకోవడం పోలీసుల డ్యూటీ అని బండి తెలిపారు. పోలీసులు తమ డ్యూటీ చేయొద్దని చెప్పడానికి అక్బరుద్దీన్ ఎవరని సంజయ్ ప్రశ్నించారు. పాతబస్తీలో కరెంట్ నష్టాలు రావడంలేదని అక్బరుద్దీన్ మాట్లాడితే ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. సర్కారుకు దమ్ముంటే కరెంట్ నష్టాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ కారు స్టీరింగ్ తమ చేతిలో ఉందన్నా అప్పటి సీఎం కేసీఆర్ ఏం పట్టనట్టే ఉన్నాడని, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా మజ్లిస్ కు పూర్తిగా లొంగిపోతుందని పేర్కొన్నారు.

పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదుట భారీ బహిరంగ సభ నిర్వహించి జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లేలా చేశామని, ఇప్పుడు పాతబస్తీ తమ అడ్డా ఎవరూ రావద్దంటే ఊరుకునేది లేదని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ సత్తా ఏంటో చూపిస్తామని, అక్బరుద్దీన్‌కు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను బండి ఖండించారు. 15 నిముషాలు సమయమిస్తే హిందువులను నరికి చంపుతామని బహిరంగ వ్యాఖ్యలు చేసినా పాత చట్టాలలోని లొసుగుల ఆసరాగా చేసుకుని తప్పించుకున్నాడని ఫైరయ్యారు. కొత్త చట్టాలొస్తే శిక్ష తప్పించుకోలేరని తెలిసి వాటిని తప్పు పడుతుండటం సిగ్గుచేటని బండి విమర్శలు చేశారు.


Similar News