Union Elections: సెక్రటేరియట్‌లో ఎలక్షన్ వార్..! తొలిసారి ఉద్యోగ సంఘం ఎన్నికలు

సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నది.

Update: 2024-12-31 01:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రతి డిపార్ట్ మెంట్ కు వెళ్లి ఓటరును వ్యక్తిగతంగా కలుస్తున్నారు. దీంతో సెక్రటేరియట్ మొత్తం ఎన్నికల వేడి నెలకొన్నది. మరోవైపు ఎంప్లాయీస్ వాట్సప్ గ్రూపుల్లో ఆకట్టుకునేవిధంగా పోస్టింగ్ పెడుతున్నారు. వచ్చే నెల 4న ఉదయం గం.10 నుంచి సాయంత్రం గం.3 వరకు పోలింగ్ జరుగనుంది.

రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలి ఎన్నికలు

రాష్ట్ర ఏర్పాటు తరువాత మొదటిసారి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనితో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఉద్యోగుల్లో నెలకొన్నది. మొత్తం 1,104 మంది ఓటర్లు ఉండగా, 11 పోస్టుల కోసం 67 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టులకు తీవ్ర పోటీ ఉంది. అయితే ప్యానల్ తో సంబంధం లేకుండా విడిగా చాలా మంది ఎంప్లాయీస్ బరిలోకి దిగడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మొదలైంది. అభ్యర్థులు ప్రతి డిపార్ట్ మెంట్ కు వెళ్లి, అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ ను విడిగా కలిసి ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే ఒక్కో ఓటరును రెండు, మూడు సార్లు కలిసినట్టు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఎంప్లాయీస్ వాట్సప్ గ్రూపుల్లో ఆకట్టుకునేవిధంగా పాంప్లెట్స్, కొటేషన్స్ పెడుతూ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్టుల హోరును భరించలేని కొందరు ఎంప్లాయీస్ వాట్సప్ ను ఓపెన్ చేసేందుకూ జంకుతున్నారు.

పెద్ద ఎత్తున దావత్‌లు

పోలింగ్ కు రోజులు దగ్గరపడటంతో ఓటర్ల కోసం పెద్ద ఎత్తున దావత్ లు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గత వారం వరసగా సెలవులు రావడంతో ఎంపిక చేసిన ఓటర్లకు అభ్యర్థులు సిటీ శివారులో పార్టీలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అలాగే సెక్రటేరియట్ పరిసరాల్లోని క్లబ్స్ లో రెగ్యులర్ గా పార్టీలు జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు మాత్రం పోటీలు పడి పార్టీలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. సగటును కొందరు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ. 20 లక్షలకు దాటుతుందని టాక్ వినిపిస్తున్నది.

Tags:    

Similar News