Union Budjet: మంత్రులు గుజరాత్ కో, బీహార్ కో పోవాలి..! మంత్రి పొన్నం హాట్ కామెంట్స్

నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కారని, ఇప్పుడు కూడా తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా తప్ప.. ఒక్క రూపాయి కేటాయించలేదని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

Update: 2024-07-23 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో లోక్ సభలో తెలంగాణ ఏర్పాటు పట్ల విషం కక్కారని, ఇప్పుడు కూడా తెలంగాణకు బడ్జెట్ లో గుండు సున్నా తప్ప.. ఒక్క రూపాయి కేటాయించలేదని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ట్వట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. మేము ఇచ్చిన అంశాలను కేంద్రం పరిగణన లోకి తీసుకోలేదని, నిర్మల సీతారామన్ గారి 2 గంటల ప్రసంగంలో కనీసం తెలంగాణ అనే పదం కూడా ఎత్తలేదని మండిపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో చెప్పినట్టు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు కేటాయించారు. మరి ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణకు ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి నిర్మిస్తున్నారని, తెలంగాణ ఒక్క జాతీయ ప్రాజెక్ట్ కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న రాష్ట్రానికి గుండు సున్నా అంటే ఇది తీరని అన్యాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళనకు నిధులు కేటాయించాలని వేడుకున్న ఒక్క రూపాయి ఇవ్వలేదుని, ఇతర రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి గంగానది ప్రక్షాళనకు వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం అంబర్ పేట నుండి మూసి నది పోతుంది అయినా ఒక్క రూపాయి అయినా కేటాయించారా..? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. 10 సంవత్సరాలుగా నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడగలేదనే కారణాలు చూపెట్టారు. కానీ ఇప్పుడు అన్ని ప్రతిపాదనలు చేసినా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా.. ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన ఆంధ్రప్రదేశ్, బీహార్ కు భయపడి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు.

ఇది నరేంద్ర మోడీ లోపభూయిష్టమైన విధానాన్ని చూపిస్తుందని మండిపడ్డారు. ఇక రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రాష్ట్రానికి రాకుండా గుజరాత్ కో, బీహార్ కో పొమ్మని కోరుతున్నామని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ మాత్రం తేలేని అసమర్తులు ఈ రాష్ట్రం నుండి మంత్రులుగా ఉండడం మంచిది కాదని అన్నారు. 8 మంది ఎంపీలను గెలిపించిన ఈ రాష్ట్రంలో బీజేపీ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. మేము అడుగుతున్నా నిర్లక్ష్యం చేయడం అంటే తెలంగాణ ప్రజలను నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అవమాన పరచడమేనని అన్నారు. అలాగే విభజన హామీలు అమలు చేయకపోవడం పట్ల వారి చిత్తశుద్ది స్పష్టం అవుతుందని, గతంలో తెలంగాణ పై విషం కక్కిన నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా బడ్జెట్ లో అదే వైఖరితో బీహార్ ఆంధ్రప్రదేశ్ కి భయపడి నిధులు ఇచ్చారనీ ప్రజలు అర్థం చేసుకోవాలని పొన్నం స్పష్టం చేశారు.

Tags:    

Similar News