317 జీవోకు చరమ గీతం పాడండి..!

317 జీవో బాధితుల పైన ప్రభుత్వం కనికరం చూపి డిసెంబర్ 31 లోపుగా సొంత జిల్లాలకు పంపించే ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేయాలి.

Update: 2024-12-27 00:30 GMT

317 జీవో బాధితుల పైన ప్రభుత్వం కనికరం చూపి డిసెంబర్ 31 లోపుగా సొంత జిల్లాలకు పంపించే ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేయాలి. ఎన్నో ఉద్యోగుల కుటుంబాలను విచ్చినం చేసి మానసిక ప్రశాంతత దూరం చేసిన యమపాశం లాంటి చీకటి జీవో పట్ల ఉద్యోగ ఉపాధ్యాయులు కన్నెర్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లు సొంత జిల్లాలకు ఉద్యోగులను తీసుకెళ్తారనే ఆశ ఇన్ని రోజులు ఉండేది. కానీ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ 317 జీవో బాధిత ఉపాధ్యాయ ఉద్యోగులకు నిరాశనే మిగిల్చింది.

ఉన్నపళంగా జిల్లాలు దాటించేసి..

317 జీవో ప్రభావంతో ఉన్నపళంగా జిల్లాలు దాటి శాశ్వత ఉద్యోగులుగా మిగిలినటువంటి బాధిత కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి ఉద్యోగులను సత్వరమే సొంత జిల్లాకు పంపించాలి. ఈ జీవో బాధితులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశారు కూడా. ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలో పెట్టినట్లు ఉద్యోగులకు స్థానికతను కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. అంతేకాకుండా రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ చేయాలి. బాదిత ఉపాధ్యాయ ఉద్యోగులకు ఏ విధంగా ఉపశమనం ప్రభుత్వం కల్పిస్తుందో కూడా తెలియజెప్పాలి.

నిన్న శాసనమండలిలో జరిగిన చర్చలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ ఎమ్మెల్సీ AVN రెడ్డి, తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం 317 జీవో బాధితుల పక్షాన తమ గళాన్ని వినిపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన హామీకి కట్టుబడి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేయాలి. నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులను సొంత జిల్లాకు పంపిస్తారనే ఆశ వారిలో చిగురిస్తుంది. ముఖ్యమంత్రి సానుకూల దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరిస్తారని వేయికళ్లతో బాధిత ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

వై. రత్నమాల, అద్యక్షులు

డిస్‌లొకేటెడ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం


Similar News