ఓట్ల కోసమే అంబేడ్కర్ నామస్మరణ!

ఈ దేశంలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఆలోచనలన్నీ కుల పరమైన రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. అందుకే దేశంలో కుల రాజకీయాల ప్రభావం

Update: 2024-12-25 01:00 GMT

ఈ దేశంలో అన్ని పార్టీల రాజకీయ నాయకుల ఆలోచనలన్నీ కుల పరమైన రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. అందుకే దేశంలో కుల రాజకీయాల ప్రభావం బలంగా ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నిమ్న వర్గాల ప్రజలకు ఆరాధ్యనీయుడు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరును అన్ని రాజకీయ పార్టీలు తరచుగా తలుస్తూ ఉంటాయి. ఇటీవల రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ పేరును ప్రస్తావించడం పెద్ద వివాదాస్పదమైంది.

మోడీ వ్యతిరేక ప్రతిపక్షాల నాయకులకు పార్లమెం ట్ సమావేశాలలో చర్చించడానికి దేశానికి సంబంధించిన ఏ విషయాలూ దొరకలేదు. అందుకే అదానీ ముడుపుల బాగోతం గురించి పార్లమెంటులో చర్చకు పెట్టి, పార్లమెంట్ సమావేశాలు జరగకుండా బల ప్రదర్శన చేశారు. వాస్తవంగా అమెరికాలో ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఆరోపణలపై భారతదేశ పార్లమెంట్ చర్చించాలా? వద్దా? అనే విచక్షణ కూడా లేకుండా ప్రతిపక్ష కూటమి పార్లమెంటు సభ్యులు చెలరేగిపోయారు.

అంబేడ్కర్‌ని అవమానించింది ఎవరు?

కేంద్ర హోంమంత్రి అంబేడ్కర్ ప్రస్తావన తేవడం ఉద్దేశపూర్వకమేనని రాజకీయ పరిశీలకుల అభిప్రా యం. వాస్తవాలు మాట్లాడాలంటే ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు అంబేడ్కర్ ఆలోచన విధానం నచ్చదు. కమ్యూనిస్టు ఆలోచన విధానాన్ని, ఇస్లాం, క్రైస్తవ మత ఆలోచన ధోరణిని ఆయన తీవ్రంగా దునుమాడారు. అందుకే ఈ మూడు వర్గాల వారికి అంబేడ్కర్ నచ్చడు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని మినహాయిస్తే, చాలామందికి అగ్రకుల దురహంకారపు ఆలోచనలు సడలిపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్యను అర్ధాంతరంగా పక్కన పెట్టడానికి, బాబూ జగ జీవన్ రామ్‌ను ప్రధాని కానీయకుండా కాంగ్రెస్ అడ్డుకోవడానికి కారణం ఇదేనని అంటే సత్య దూరం కాదేమో! ఈ నేపథ్యమే 1952, 1954 లోక్‌సభ ఎన్నికల్లో అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందని, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయకుండా, భారతరత్న అవార్డు ఆయనకు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారని బీజేపీ నాయకులు చేసే వాదనలో కొంత సత్యం లేకపోలేదు. జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ తాము అధికారంలో ఉండగానే తమకు తామే భారతరత్న అవార్డులు తీసుకున్నారని విషయం ఈ దేశంలోని సామాన్య ప్రజలకు తెలియదు గాక తెలియదు.

నిమ్న వర్గాల భ్రమలతో రాజకీయం

ఇక దేశంలోని నిమ్న వర్గాల ప్రజలు అంబేడ్కర్ ఆలోచన విధానంలోని కులం ఆధారిత రిజర్వేషన్లు తమ అభివృద్ధికి కొంత బాసటగా నిలుస్తాయనే భ్రమల్లో తేలియాడటం సర్వసాధారణం అయింది. ఈ భ్రమలను ఆధారం చేసుకుని, దేశంలోని అగ్ర కుల రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్‌కు ఏదో అవమానం జరిగిపోయిందని గావు కేకలు మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకులను రెచ్చగొట్టి, ముగ్గులోకి దింపి, అంబేడ్కర్ విషయంలో వారు చేసిన పొరపాట్లు, దేశ భద్రత, దేశ సమైక్యత, సమగ్రతల విషయంలో ప్రతిపక్ష నాయకుల ఆలోచనలలోని డొల్లతనాన్ని దేశంలోని సామాన్య ప్రజలకు తెలియజేయడం కోసమే మోడీ ప్రభుత్వం పార్లమెంటును వేదికగా చేసుకున్నదనే విషయం ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోకపోవడం లేదు.

ఈ గావుకేకలు ఎవరికి లాభం..!

అంబేడ్కర్ గురించి నాలుగు ఊకదంపుడు మాటలు మాట్లాడితే, నిమ్న వర్గాల ఓట్లు గంపగుత్తగా పడతాయనే అత్యాశ ప్రతిపక్ష నాయకులకు మెండుగానే ఉన్నట్లు పార్లమెంట్ సమావేశాల్లో వారు పడుతున్న పాట్లను బట్టి తెలుసుకోవచ్చు. ఈ దేశంలో నిమ్న వర్గాలో చాలామందికి వ్యవసాయం చేసుకుంటూ, ఒకరి దయ, దాక్షిణ్యంపైన ఆధారపడకుండా జీవించడానికి వ్యవసాయ యోగ్యమైన పొలాలను ఏర్పాటు చేయడంలో ఇంతవరకు దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపలేదని వారి ఎగుడుదిగుడు బతుకులు తెలియజేస్తున్నాయి. గ్రామ, నగర కూడళ్లలో అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి, కుల ఆధారిత రిజర్వేషన్లు(అభివృద్ధి చెందిన వారే మరలా మరలా రిజర్వేషన్ ఫలాలు పొందడం) పొడిగిస్తూ పోతే, తమ బతుకులు బాగుపడతాయని ఆ వర్గాల నాయకులు, ఆ వర్గాల మేధావులు ఆలోచించినంత కాలం అంబేడ్కర్ పేరు మీద గావుకేకలు వినబడుతూనే ఉంటాయి. 

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Tags:    

Similar News