గుదిబండగా మారనున్న డిటెన్షన్ పద్ధతి

6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం -2009 (ఆక్ట్ 35 ఆఫ్ 2009), 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది.

Update: 2024-12-26 23:30 GMT

భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానే డిటెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యలో ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థులు వారి వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ఒకవేళ విద్యార్థులు ఉత్తీర్ణులు కాకపోతే వారికి రెండు నెలల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలి. రీ-ఎగ్జామ్‌లో కూడా విద్యార్థులు ఫెయిల్‌ అయితే సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం కావున ఈ నిర్ణయం అమలు రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని, కానీ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక పాఠశాలలకు విధిగా ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం ‘నో డిటెన్షన్‌ విధానమే’ కొనసాగుతుంది.

6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం -2009 (ఆక్ట్ 35 ఆఫ్ 2009), 2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చింది. విద్యాహక్కు చట్టానికి 2019 మార్చిలో చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు(5,8) నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని కేంద్రం స్పష్టం చేసింది. పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం కావున ఈ నిర్ణయం అమలు రాష్ట్రస్థాయిలో జరుగుతుందని, కానీ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలలకు విధిగా ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రస్తుతం ‘నో డిటెన్షన్‌ విధానమే’ కొనసాగుతుంది.

బలహీనవర్గాలకు విద్య దూరం..

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు 5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానం అమలు జరిగితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో డ్రాపౌట్స్ పెరుగుతారు, బడుగు బలహీనవర్గాలకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు వరకు బాలలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. 8వ తరగతి వరకు ఏ ఒక్క విద్యార్థినీ ఫెయిల్ లేదా నిలుపుదల చేయకూడదు. కానీ కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానం (NEP -2020) అమలు పేరుతో విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి డిటెన్షన్ పద్ధతిని తీసుకువచ్చింది. 2018 లోనే కేంద్ర ప్రభుత్వం డిటెన్షన్ పద్ధతి ప్రతిపాదన తీసుకురాగా ఆనాడే ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, విద్యావేత్తలు, మేధావులు వ్యతిరేకించారు. నాటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి రాష్ట్రంలో డిటెన్షన్ విధానాన్ని అమలు జరపబోమని ప్రకటించారు.

ఇంగ్లీషులో రెండు వాక్యాలు చదవలేరు..

26.5 కోట్ల మంది విద్యార్థులు,14.9 లక్షల పాఠశాలలు, 95 లక్షల మంది ఉపాధ్యాయులతో భారతీయ విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందింది. అసర్(ASER )రిపోర్ట్ -2023 ప్రకారం భారతదేశంలోని 26 రాష్ట్రాల్లో 28 జిల్లాల్లో 34,745 మంది 14-18 వయసు గల వారిని సర్వే చేస్తే వారిలో 42.7% ఇంగ్లీష్ లో కనీసం రెండు వాక్యాలు కూడా చదువలేకపోతున్నారు. 2 వ తరగతి పాఠ్య పుస్తకాలు వారి ప్రాంతీయ భాషల్లో చదవడం లేదు. కేవలం 43% మాత్రమే చతుర్విధ ప్రక్రియలు

చేయగలుగుతున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా 50% విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు లోపించాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీరంతా పాఠశాల విద్యను పూర్తి చేసుకున్నవారే, వీరి అభ్యసన స్థాయిలే ఇలా ఉంటే 5,8 తరగతుల విద్యార్థులకు వారి వార్షిక పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు. వారి అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు డిటెన్షన్ విధానం గుదిబండగా మారనుంది.

డిటెన్షన్ విధానం పరిష్కారమా?

కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత సంవత్సరం 65 లక్షల మందికి పైగా విద్యార్థులు 10 మరియు 12 వ తరగతి బోర్డు పరీక్షలను ఉత్తీర్ణులు కాలేకపోయారు. ఫెయిల్యూర్ రేటు జాతీయ బోర్డులతో పోల్చుకుంటే రాష్ట్ర బోర్డుల్లో ఎక్కువగా ఉంది. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రమాణాలు పెంచడం కోసం 5, 8 తరగతిలో వార్షిక పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిర్ణయం తీసుకున్నామని కేంద్రం అంటుంది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (NSSO) ప్రకారం భారతదేశంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా విద్యారంగానికి సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, దేశంలో 33 శాతం టీచర్లు అర్హత కలిగిన వారు అందుబాటులో లేకపోవడం, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు టీచర్లు అందిపుచ్చు కోకపోవడం, మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా వారిలో సృజనాత్మకతను పెంచేలా కరికులం లేకపోవడం, దేశంలోని మెజారిటీ బడుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం ప్రధానంగా మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, విద్యుదీకరణ తరగతి గదులు చాలినంత అందుబాటులో లేకపోవడం. పై సమస్యలన్నింటికీ మూల కారణం బడ్జెట్లో విద్యారంగానికి నిధులు అధికంగా కేటాయించక పోవడం.

విద్యారంగ తిరోగమన చర్య

డిటెన్షన్ విధానం విద్యారంగ తిరోగమన చర్యగా మారే అవకాశం ఉంది. బడుగు బలహీనర్గాలకు వర్గాలకు చెందిన విద్యార్థులు,గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాల విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. డ్రాప్స్ ఔట్స్ పెరగడం ద్వారా బాల కార్మికులు పెరిగే అవకాశం కూడా ఉంది. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయం పెరిగి ఉత్తీర్ణులు కాకపోతే వారిలో న్యూనతాభావం ఏర్పడి పసితనంలోనే మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంది. ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వ చర్య. నో డి టెన్షన్ విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ మన విద్యార్థులను ప్రపంచస్థాయి విద్యార్థులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాల్సి ఉండగా, కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ నో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం.

అసంబద్ధ నిర్ణయాలు ఇంకానా?

పాఠశాల విద్యలో పర్యవేక్షణ మెరుగుపరిచి, పకడ్బందీగా పరీక్షల నిర్వహిస్తే తప్పకుండా విద్యార్థుల్లో ప్రమాణాలు మెరుగుపడతాయి. అదేవిధంగా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ, ప్రాథమిక స్థాయిలో తరగతి ఒక ఉపాధ్యాయున్ని నియమించి, బోధనలో ఉపాధ్యాయులకు స్వేచ్ఛనిస్తే విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలు పెరిగేలా ఉపాధ్యాయులు తప్పకుండా దృష్టి పెడతారు. విద్యార్థి అభ్యసన స్థాయి వాని అస్తిత్వం పైన, శారీరక, మానసిక స్థితి పైన, తన చుట్టూ ఉండే పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నా వారు ఐదు, ఎనిమిది తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలనే నిర్ణయం అసంబద్ధమైనది.

డిటెన్షన్ విధానం అశాస్త్రీయమైనది.క్రమం తప్పకుండా బడికి హాజరయ్యే విద్యార్థిలో కనీస అభ్యసన సామర్ధ్యాలు లేకపోవడానికి కారణాలను విశ్లేషించి పరిష్కారాలు కనుగొంటే నో డిటెన్షన్ విధానం మరింత మెరుగవుతుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పునర్ ఆలోచన చేయాలని, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో డి టెన్షన్ పద్ధతి అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరం కాకుండా పాలకులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

పాకాల శంకర్ గౌడ్,

విద్యావేత్త,

98483 77734

 


Similar News