సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్! సోషల్ మీడియా వేదికగా విమర్శలు
తెలంగాణలో బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. 2021 రేవంత్ రెడ్డి బొగ్గు గనులను వేలం వేయోద్దు అని కేంద్రానికి రాసిన లేఖను ప్రస్థావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో రేవంత్ రెడ్డి గారూ.. గతంలో బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేఖించిన మీరు ముఖ్యమంత్రి అయ్యాక వేలంలో పాల్గొనడానికి, ప్రచారం చేయడానికి మీ డిప్యూటీ సీఎంను పంపించారని, ఈ బలవంతం వెనుక ఉన్న కారణాలను వివరించగలరా? అని ప్రశ్నించారు. అలాగే గుజరాత్ ,ఒరిస్సాలలోని గనులను వేలం నుంచి మినహాయింపు ఇచ్చి పీఎస్‌యూలకు ప్రత్యక్ష కేటాయింపు చేపట్టారని, తెలంగాణలో కూడా అలా చేయాలని ఎందుకు ప్రశ్నించడం లేదని ట్వీట్ చేశారు.
దీనికి రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలుగా కొట్లాది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోని మీరు ఇప్పుడు వాస్తవాలను వినడానికి శ్రద్ద చూపరని మండిపడ్డారు. అలాగే గతంలో అరబిందో, అవంతిక కంపెనీలకు కేటాయించేటప్పుడు వ్యతిరేఖంగా మాట్లడలేదని, మా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు దానిని వ్యతిరేఖించడమే కాకుండా మీ ప్రియమైన కంపెనీలకు విక్రయించిన బొగ్గు బ్లాకును రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అంతేగాక సింగరేణి, ఓఆర్ఆర్ కలెక్షన్ హక్కులను అమ్మినప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.
రేవంత్ రెడ్డి ట్వీట్ కు కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. మీ అబద్దపు ప్రచారానికి సమాధిలో ఉన్న గోబెల్స్ ఉలిక్కిపడుతున్నాడని, బొగ్గు బ్లాకుల అమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటినుండో వ్యతిరేఖిస్తుందని, మీ లాగా ప్రత్యక్షంగా వేలంలో పాల్గొనలేదని విమర్శలు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నదీప్రాంత హక్కులను కాపడడంలో కాంగ్రెస్ ఎలా విఫలమైందో ప్రజలు ఇప్పటికే చూశారని, బొగ్గుగనుల విషయంలో బీజేపీకి మీ సహకారం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు చేశారు. అంతేగాక గనులను వేలం వేయడానికి భట్టిగారు, కిషన్ రెడ్డిగారు వేదికను పంచుకోవడం చరిత్ర మర్చిపోదు అని, రెండు జాతీయ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.