ఇది ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన: మాజీ మంత్రి హరీష్ రావు

రాష్ట్రంలో 11 నెల‌ల రేవంత్ రెడ్డి పాల‌న చూస్తే ప్రజా పాల‌న కాదు.. ప్రజా పీడ‌న‌గా క‌న‌బ‌డుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు.

Update: 2024-10-28 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 11 నెల‌ల రేవంత్ రెడ్డి పాల‌న చూస్తే ప్రజా పాల‌న కాదు.. ప్రజా పీడ‌న‌గా క‌న‌బ‌డుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజా పాల‌న తొలిగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృత‌రూపం బ‌ట్టబ‌య‌టలైందని, ఏ వ‌ర్గానికి తామిచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయిందన్నారు. సీఎం వికృత‌రూపాన్ని చూసి ప్రజ‌లు విస్తుపోతున్నారని, రాష్ట్రంలో ఎక్కడా చూసినా ధ‌ర్నాల‌తో అట్టుడికి పోతోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లడమే సీఎంకు తెలుసు అని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడన్నారు.

కొత్త హామీలు కాదు.. కేసీఆర్ పేదల కోసం మానవీయ కోణంలో ప్రారంభించిన పథకాలను కొనసాగించలేకపోతున్నారని మండిపడ్డారు. రైతు కోసం ఎకరానికి ఏటా రైతుబంధు 10 వేలు ఇచ్చామని, ఒక్క పంటకు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరలు లేవు, రైతు బంధు లేదు...రుణమాఫీ కాలేదు...పంటలు కొనే దిక్కు లేదు అని అన్నారు. పత్తి ఎక్కడైనా కొనుగోలు చేశారా? అని నిలదీశారు. క్వింటాకు 7521 ఏంఎస్పీ అని చెప్పి మోసం చేశారని, దీంతో క్వింటా 5వేలకు అమ్ముకుంటున్నారన్నారు. బోనస్ అని చెప్పి బోగస్ అయిందన్నారు. మక్కల కొనుగోలు ప్రారంభం కాలేదని, రైస్ మిల్లులతో ఇంకా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు. సోయాబిన్ కొనుగోలు చేయడం లేదని, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లో రైతులు రోడ్డెక్కారన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.

నిరుద్యోగుల హామీ ఏమైందని నిలదీశారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అని కనీసం 20 వేల ఉద్యోగాల కన్నా నోటిఫికేషన్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు అని కాంగ్రెస్ మోసం చేసిందని, నయాపైసా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయలేదని, విద్యార్థుల బతుకులు ఆగం అవుతుంటే మొద్దు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. తక్షణం పెండింగ్ డీఏలు, పీ ఆర్ సీ అని చెప్పి ఉద్యోగులను సీఎం మోసం చేశారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు దేశంలోనే పైసలు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. 317 జీవోకు పరిష్కారం చేయలేదన్నారు. ఉసురు పోసుకుని వర్గాలు ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ప్రతిపక్షం బీఆర్ఎస్ పై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రికి మెదడు నిండా విషం తప్ప.‌.‌ విజన్ లేదని ఎద్దేవా చేశారు. అవగాహన లేక, పరిపాలన రాక రాష్ట్రాన్ని దివాలా తీశావు అని, మేము పోరాటం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావని, రుణమాఫీ గురించి మాట్లాడితే వికృతంగా మాట్లాడారని అన్నారు. రుణమాఫీపై ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి తనను బాడీ షేమింగ్ చేశారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే తెలంగాణ ఆదాయం పడిపోయిందని ఆరోపించారు. మూసి అక్రమాలు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ పై మీద దాడి చేస్తున్నావు.. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని పోరాటం చేస్తున్నావు అని సీఎంపై మండిపడ్డారు. మూసి అభివృద్ధికి కాదు, అవినీతి వ్యతిరేకం అని కేటీఆర్ చెప్పారన్నారు. బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని, కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బ తీసే యత్నం చేయడం కరెక్ట్ కాదన్నారు.

కేటీఆర్ బావమరిది ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, రేవ్ పార్టీ జరగకముందే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, రేవ్ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారా..? దీపావళి పండుగ జరుపుకుంటే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాంహౌస్ ఘటన వెనుక రేవంత్ ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. అది ఫాంహౌస్ కాదు.. రాజ్ పాకాల కొత్త ఇల్లు అని తేల్చి చెప్పారు. రేవ్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనిఖీలు చేసిన అధికారులే ఏమి దొరకలేదని చెప్పారని, దురదృష్టవశాత్తు కొన్ని మీడియాలు జరగంది, జరిగినట్లు ప్రచారం చేయడం బాధాకరం అన్నారు.మా అభిప్రాయాలు తీసుకోకుండా మంచిది కాదు... మీడియా ఆలోచించాలని కోరారు. కేటీఆర్ ప్రజల సమస్యల మీద కొట్లాడితే, కక్ష తీర్చుకునే విధంగా ప్రభుత్వం చూస్తున్నదన్నారు. కాంగ్రెస్ ఎంత భయపెట్టిన మేము పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

మూసి అభివృద్ధి ప్రారంభించిందే కేసీఆర్ అని, గోదావరి నీళ్ళు ముసికి తెచ్చే ప్రయత్నం చేసిందే ఆయన అని స్పష్టం చేశారు. మూసి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అరాచకాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడతాం అంటే సహించబోమన్నారు. పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులు తమను తామే చంపుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఏక్ పోలీస్ విధానం అమలు చేస్తామని చెప్పి సెలవులు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 39 మందిని సస్పెండ్, 10మందిని డిస్మిస్ చేశారని, పండగ పూట వారిని ఎందుకు ఏడిపిస్తున్నావ్ అని నిలదీశారు. కంటికి రెప్పలా కాపాడుతున్న వారిపై ఎందుకు అంత కక్ష అని, కిరాయి మూకలుగా పోలీసులను ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. రక్షక భటుల రక్షణ లేని రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుస్తోందన్నారు. నేరస్తుడు పాలకుడు అయితే రేవంత్ పాలన లాగా ఉంటుందన్నారు.

‘పోలీసు పాలన అంటారు.. మరి పోలీసుల మీద నిర్బంధం ప్రయోగిస్తే ఏమంటారు... రేవంత్ రెడ్డి పాలన అంటారు’ అని ఎద్దేవా చేశారు. పోలీసులే రోడ్డు‌ మీదకు రావటం చరిత్రలో మెదటసారి అని గుర్తుచేశారు. పండుగ, పెళ్లిళ్ల సీజన్ లో ఎవరైనా 144 సెక్షన్ పెడుతారా? అని నిలదీశారు. బట్టలు కొనొద్దు, ఫంక్షన్ షాపింగ్ చేయవద్దా? అని ప్రశ్నించారు. రజాకర్ రాజ్యం లెక్కనే రేవంత్ పాలన ఉందని దుయ్యబట్టారు. ప్రజలు అంటే రేవంత్ కు ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు. అనాలోచిత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కంచెలు లేని పాలన అని ఆంక్షల పాలన తెచ్చారని ధ్వజమెత్తారు. వ్యతిరేక వస్తుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలు అమాయకులు కాదన్నారు. అశోక్ నగర్ ను శోక నగర్ గా మార్చింది రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు.

‘ఏ ఊరైనా పోదాం సన్నవడ్లు కొంటున్నారా? ఏ మూలన పత్తి కొన్నారా? వరంగల్, ఖమ్మం పత్తి మార్కెట్ పోదామా’ అని సవాల్ చేశారు. మీడియాకు లీకులు ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. బండి సంజయ్ ఆయన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తానా అంటే.. బండి సంజయ్ తందానా అంటున్నారని విమర్శలు చేశారు. బాధ్యత కలిగిన పదవీలో ఉండి బండి సంజయ్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హోం శాఖ మీదే వాస్తవాలు తెల్సుకుని మాట్లాడాలని, బాధ్యత పదవిలో ఉంది అవాస్తవాలు మాట్లాడటం కరెక్టేనా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తరుఫున బండి సంజయ్ వకాల్తా పుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా.. ‘ఆర్ఎస్’ బ్రదర్స్ ప్రభుత్వం నడుస్తోందా.. అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయమంత్రిగా పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రజల సమస్యల గురించి ఏనాడు మాట్లాడడు... మేనిఫెస్టో గురించి మాట్లాడడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ మంచి కోరుతాడన్నారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ గురించిబీఆరెస్ కొట్లాడితే బీజేపీ ఎందుకు మౌనం అని ప్రశ్నించారు. పోలీసుల సమస్యలపై ఎందుకు మాట్లాడరన్నారు. రేవంత్ రెడ్డి అదిగో పులి అంటే, బండి సంజయ్ అదిగో తోక అంటున్నాడని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి ఉపాధిహామీ నిధులు 1500కోట్లు, 15వ ఆర్థికసంఘం నుంచి 500కోట్లు, 300 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చాయని వాటిని దేనికి ఖర్చుపెట్టారని ప్రశ్నించారన్నారు. మూసీ విషయంలో నల్లగొండ రైతులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.


Similar News